8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కావాలి..


Ens Balu
4
Visakhapatnam
2021-09-18 13:39:49

ఎం .పి .టి.సి., జెడ్.పి.టి.సి., ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబందించి అన్ని కౌంటింగ్ హాల్స్ వద్ద ఉదయం 8గంటల కల్లా ప్రారంభించాలని  అందుకు తగిన ఏర్పాట్లుతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  ఓట్ల లెక్కింపు    అధికారులను, సిబ్బందిని  ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు  కౌంటింగ్ ఏజెంట్లకు సంబందిత రిటర్నింగ్ అధికారులు గుర్తింపు కార్డులను ఇచ్చి లోపలకు పంపించాలన్నారు.  కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా  సామాజిక దూరం పాటిస్తూ  సీటింగ్ ఏర్పాట్లను చేయాలన్నారు. 
 19వ తేది ఆదివారం ఓట్ల లెక్కింపు పురస్కరించుకొని  శనివారం జిల్లా కలెక్టర్ అనకాపల్లి, మునగపాక, అచ్చుతాపురం మండలాలలో  పర్యటించి  అక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ అధికారులు, సిబ్బందితో  కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను  పగడ్భందిగా చేపట్టాలని ఆదేశించారు.  నిరంతర విద్యుత్తు , గాలి, వెలుతురు ఉండాలని  శానిటేషన్, నిరంతర నీటి సౌకర్యం, తదితర మౌళిక వసతులతో సిద్దంగా ఉండాలన్నారు.  అచ్చుతాపురం జెడ్.పి.హెచ్ స్కూల్ లో చదువుతున్న విద్యార్ధులతో కలెక్టర్ మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్నం బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ అక్కడి విద్యార్ధులతోను, టీచర్లతోను అడిగి తెలుసుకున్నారు. విద్యార్దులు తమ పాఠశాలలో ఆట స్థలం  పాడైపోయిందని, బాగు చేయించాలని కోరగా అందుకు కలెక్టర్ స్పందిస్తూ నాడు – నేడు పనులలో భాగంగా గ్రౌండుకు మరమ్మత్తులను చేయించాలని  ప్రధానోపద్యాయులను  ఆదేశించారు.  
 కలెక్టర్ పర్యటనలో అనకాపల్లి ఆర్.డి.ఓ., సీతారామరావు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు,ఇతర అధికారులు హాజరైయారు.