సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
కలెక్టరేట్ 
                            2020-09-10 20:18:01
                        
                     
                    
                 
                
                     గ్రామ,వార్డు సచివాలయ  రిక్రూట్ మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, గ్రామ, వార్డు సిబ్బంది రిక్రూట్ మెంట్  పరీక్షలు నిర్వహించే అధికారులు, పరీక్షలు ప్రారంభా నికి ముందు, జరుగుతున్న సమయంలో , పూర్తయిన తర్వాత చేయవలసిన పనుల మీద పూర్తి అవగాహనతో శ్రధ్ధ తో పని చేయాలని సూచించారు.  గతంలో పరీక్షలు నిర్వహణ లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా వాటి అనుభవాలను పరిగణలోకి తీసుకొని పరీక్షలు సక్రమంగా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈనెల 20 నుంచి  ప్రారంభం కానున్న సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల నిమిత్తం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలవద్ద పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రతీ అభ్యర్థికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నారు. 
శానిటైజర్ వేసి, చేతులు శుభ్రం చేసుకున్న తరువాతే లోపలికి పంపించాలని చెప్పారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని, అవసరమైతే ఉపయోగించడానికి ప్రతీ కేంద్రంలో మాస్కులను కూడా రిజర్వులో ఉంచాలని సూచించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు పరీక్షలు రాసేందుకు అనుగుణంగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్దా ప్రత్యేక గదులను  ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంవద్ద ఒక ఎఎన్ఎంను ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ థర్మామీటర్లు, పల్స్ ఆక్సీమీటర్, అవసరమైన మందులను కూడా సిద్దంగా ఉంచాలని సూచించారు.  అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా ఆర్‌టిసి అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  మాట్లాడుతూ పరీక్షల వివరాలను, చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో  ఖాళీలను భర్తీ చేస్తున్నామని, మొత్తం 1,50,441 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు.  ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు,  ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.
 ప్రతీ అభ్యర్థి కనీసం 45 నిమిషాలముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం   మొత్తం 512  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల మధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు అనువుగా  పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాలను  క్లష్టర్లుగా విభజించి, ప్రతీ క్లష్టర్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే  సెంటర్ల స్పెషల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు,  ఛీఫ్ సూపరింటిండెంట్లు,  అదనపు ఛీప్ సూపరింటిండెంట్లు,  హాల్ సూపరింటిండెంట్లను, ఇన్విజిలేటర్లను నియమించినట్లు  వారికి సమగ్ర శిక్షణ ను ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జీవియంసి కమీషనర్ జి.సృజన, డి ఆర్ ఓ  ఎ.ప్రసాద్, జిల్లా పరిషత్ సిఈఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ విజయ లక్ష్మి,  డి.ఆర్.డి.ఎ. పీడీ విశ్వేశ్వరరెడ్డి, డీఈవో లింగేశ్వర రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.