విజయనగరం జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు ఆదివారం నోటిఫికేషన్ ను జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం, సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న మండల పరిషత్‌లకు, 25న జిల్లా పరిషత్‌కు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని ఆమె ప్రకటించారు. జిల్లాలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ చెప్పారు. మొత్తం జిల్లాలోని 34 జెడ్‌పిటిసి స్థానాలకు గానూ, 3 స్థానాలు ఏకగ్రీవంగా వైసిపి గెలుచుకోవడంతో, మిగిలిన 31 స్థానాలకు ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టామన్నారు. ఈ 31 స్థానాలను కూడా వైసిపి పార్టీ గెలుచుకుందని ప్రకటించారు. మొత్తం జెడ్‌పిటిసి ఎన్నికల్లో 9,17,724 ఓట్లు పోలయ్యాయని, వాటిని లెక్కించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో 549 స్థానాలకు గానూ, 55 స్థానాలు ఇదివరకే ఏకగ్రీవం అయ్యాయని, ఎన్నికలు జరిగిన 487 స్థానాలకు గానూ పోలైన సుమారు 9,04,302 ఓట్లను ఆదివారం లెక్కించడం జరిగిందని చెప్పారు. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 389 స్థానాలను, టిడిపి 86 స్థానాలను, బిజెపి ఒక స్థానాన్ని, స్వతంత్రులు 11 స్థానాలను గెలుచుకున్నారని చెప్పారు. ఐదుచోట్ల రీకౌంటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. బాడంగిలో ఓట్లు తడిచిపోవడంతో, 25 ఓట్లను ప్రక్కకు పెట్టడం జరిగిందని, అయితే అక్కడ సుమారు 300 ఓట్ల మెజారిటీతో టిడిపి గెలుపొందడంతో, ఎటువంటి ఇబ్బందీ లేకుండా సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.