పూర్ణాహుతితో ముగిసిన అమ్మవారి పవిత్రోత్సవాలు..


Ens Balu
3
Tiruchanur
2021-09-20 08:48:12

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రో త్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.05 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తార‌ని చెప్పారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తొంద‌న్నారు. సెప్టెంబ‌రు 18న ప్రారంభ‌మైన పవిత్రోత్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయ‌ని తెలిపారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందున‌,  ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనాల‌ని భావించే భ‌క్తుల కొర‌కు ఎస్వీబీసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ సేవ‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండ‌పంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.  ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.ఈ కార్యక్రమంలో జెఈవో  స‌దా భార్గ‌వి, ఆలయ డెప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, సూపరింటెండెంట్‌  శేష‌గిరి,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  రాజేష్ పాల్గొన్నారు.