యువత ఆరోగ్యంగా వుంటేనే ఆనందంగా వుంటామనే విషయాన్నిగుర్తించి చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా దూరంగా వుండటం ద్వారా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి అన్నారు. హెచ్.ఐ.వి. వ్యాప్తి యువతలోనే అధికంగా ఉందని, ఎందరో యువత తెలిసీ తెలియని వయస్సులో ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో హెచ్.ఐ.వి. చికిత్సకోసం ఏ.ఆర్.టి. కేంద్రాలకు వస్తున్న వారిలో 15 నుంచి 30 ఏళ్ల వారే అధికంగా వుంటున్నారని చెప్పారు. యువత ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా వుండాలని, ఒకసారి ఈ వ్యాధికి గురైతే జీవితాంతం మందులు వినియోగించాల్సి వుంటుందని అందువల్ల ఈ వ్యాధికి గురికాకుండా స్వీయనియంత్రణతో వుండాలన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో యువతకు హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పై అవగాహన కలిగించేందుకోసం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కళాజాతల ద్వారా చేపట్టిన 20 రోజుల ప్రచార కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్.ఓ. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.రమణకుమారి మాట్లాడుతూ 2030 నాటికి హెచ్.ఐ.వి. రహిత దేశంగా నిలపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తోందని, దీనిలో భాగంగా ప్రజల్లో దీనిపై వీధినాటికల ద్వారా అవగాహన కల్పించేందుకు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ పై కూడా ఈ బృందాలు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణకుమారి కోరారు. ప్రజలు కోవిడ్ బారిన పడకుండా వుండేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడం తదితర అంశాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న అదనపు వైద్య ఆరోగ్య అధికారి డా.ఎల్.రామ్మోహన్ మాట్లాడుతూ రెండు కళాజాత బృందాల ఆధ్వర్యంలో38 వీధినాటిక ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, వ్యాప్తి చెందకుండా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై కళాబృందాల సభ్యులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్స్, సహృదయ నటసమాఖ్య తదితర రెండు కళా బృందాలు ఈ కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తాయని డి.పి.ఎం. బాలాజీ పేర్కొన్నారు. సమాచార శాఖ ఏ.డి. రమేష్, జిల్లా పాజిటివ్ నెట్ వర్కు, వైద్య సిబ్బంది, ఎన్.జి.ఓ. ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.