నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు స్వామి, అమ్మవారి మూలమూర్తులకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుబట్టాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.