గురజాడ ఆశయ సాధనకు కృషి చేయాలి..
Ens Balu
2
Vizianagaram
2021-09-20 11:51:37
స్వంత లాభం కొంత మానుకొని, పొరుగువానికి తోడు పడవోయ్ అన్న మహా కవి గురజాడ ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 21 మహాకవి గురజాడ 159 వ జయంతిని కోవిడ్ నిబంధనల మధ్య అన్ని వర్గాల ప్రజలు, విద్యార్ధులు, సాహితీ, స్వచ్చంద సంస్థల సహకారం తో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గురజాడ నడయాడిన విజయనగరం లో కలెక్టర్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులందరికి, గురజాడ అభిమానులకు శుభాకాంక్షలను అందజేశారు. మహాకవి గురజాడ ఒక సంఘ సంస్కర్త, అభ్యుదయ వాది, దేశ భక్తుడు కనుకనే దేశమును ప్రేమించుమన్నా – మంచి యన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రచించగలిగారని తెలిపారు. ఈ గేయం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఈ గీతం లో ఆ కవి రాసిన ప్రతి వాక్యం ఎంతో స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ - వట్టి మాటలు కట్టి పెట్టవోయ్ ..గట్టి మేల్ తల పెట్ట వోయ్ అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్యా శుల్కం నాటకం తో ఎన్నో తరాలుగా సమాజం లో నాటుకుపోయిన దురాచారం పై తన కలం తో పోరాడిన యోధుడని, పండిత భాషను వ్యావహారిక భాష గా అందించడం లో ఎనలేని కృషి చేసిన భాషాభిమానియని, ఆ మహనీయుడు నడయాడిన ఈ నేల పునీతంఅని అభివర్ణించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పేర్కొన్న విధంగా గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడని అన్నారు. ఆయన రచనల రూపం లో అందరిలో చిరస్మరణీయునిగా నిలుస్తారని, అయన జయంతి సందర్భంగా గురజాడ గృహం లో , గురజాడ కూడలి లో జరపనున్న ఉత్సవాలకు స్వచ్చందంగా హాజరు కావాలని కోరారు.