శ్రీకాకుళం జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి, ఆపై తరగతుల వరకు విద్యనభ్యసిస్తున్న విభిన్నప్రతిభావంతుల బాలికలకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించనున్నట్లు విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో చలన సంబంధ, బదిర మరియు అంధ బాలికల కొరకు వసతి గృహాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని అన్నారు. 2021 –22 విద్యా సం.నకు గాను సదరు వసతి గృహము నందు ప్రవేశాలకై విద్యార్ధినుల తల్లితండ్రులు, స్వచ్ఛంధ సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ వసతి గృహంలో 1వ తరగతి నుండి 10వ తరగతి మరియు ఆపై చదువుతున్న విద్యార్ధులకు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న మరియు ఉపాధిశిక్షణ పొందుతున్న విభిన్నప్రతిభావంతులైన బాలికలకు శిక్షణ కాలంలో వసతి గృహం నందు ఉచిత వసతి కల్పించబడుతుందని అన్నారు. వసతి పొందుతున్న విద్యార్ధినులకు ఉచితంగా పాఠ్యపుస్తకములు, నోట్ బుక్స్, ఏడాదికి నాలుగు జతల యూనిఫారాలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు మొదలైన సదుపాయాలు కల్పించబడునని ఆయన వివరించారు. ఆసక్తి గల విద్యార్ధినుల తల్లితండ్రులు విద్యార్ధి పేరు, చదువు, తల్లితండ్రుల చిరునామా, ఫోన్ నెంబర్, 40శాతం పైబడి వికలాంగత్వ వైద్య ధృవపత్రం, ఆధార్ మరియు రేషన్ కార్డు ప్రతులతో పూర్తిచేసిన దరఖాస్తును సహాయ సంచాలకుల వారి కార్యాలయం, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ , డి.ఆర్.డి.ఏ కాంప్లెక్స్, శ్రీకాకుళం వారికి నేరుగా గాని, పోస్టు ద్వారా లేదా addwsklm@gmail.com ఈ – మెయిల్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. ఇతర వివరాల కొరకు 08942 – 240519 లేదా 94945 93926 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.