జంతువుల పట్ల ప్రతీఒక్కరూ కారుణ్యత చూపించాలి..
Ens Balu
2
Srikakulam
2021-09-20 14:04:46
జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ కారుణ్యత చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జంతు సంక్షేమ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల సంరక్షణకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పని చేయాలన్నారు. జంతువుల ఆరోగ్యం పట్ల పశుసంవర్ధక శాఖ దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. జంతువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఆయన స్పష్టం చేశారు. జంతువుల రవాణా సమయంలో సౌకర్యాలు లేకుండానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం జరుగుతున్నట్లు ఆరోపణల పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రవాణా సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన వసతులతో రవాణా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చెక్ పోస్ట్ లు, ఇతర ప్రాంతాల్లో రవాణా అంశాల పట్ల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సోంపేట మండలం రామచంద్రపురం వద్ద మంజూరు చేసిన గోశాలకు అవసరమైన వసతులు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. వీధి కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి వెంకట్రావును ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం.మురళి మాట్లాడుతూ రామచంద్రాపురం వద్ద గోశాలకు నాలుగు ఎకరాల భూమిని కేటాయించిందని, 21 లక్షల రూపాయలతో షెడ్ల నిర్మాణానికి మంజూరు జరిగిందన్నారు. అయితే కొంత పని మాత్రమే జరిగిందని మిగిలిన పని కొనసాగించాల్సి ఉందని అన్నారు. సంతలలో పశు వైద్యులు పర్యటించి పశువుల ఆరోగ్యాన్ని తనిఖీ చేస్తున్నారని చెప్పారు. సంతలలో పశు సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కమిటీ సభ్యులు గ్రీన్ మెర్సీ సంస్థ సీఈఓ కే. రమణ మూర్తి మాట్లాడుతూ జిల్లాను రేబిస్ వ్యాధి రహిత జిల్లాగా చేయుటకు చర్యలు చేపట్టాలని, అందుకు కొన్ని సంస్థలు సహకరించగలవని చెప్పారు. జంతు బలి నిషేధ చట్టం, వన్య ప్రాణి సంరక్షణ చట్టం తదితర వాటిని పక్కాగా అమలు చేయాలని ఆయన కోరారు. బారువ గోశాల నిర్వాహకులు రమణ మూర్తి మాట్లాడుతూ జంతు సంరక్షణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని వాటిని పాటించాలన్నారు. కొన్ని జంతువులు రవాణా సమయం లోనే చనిపోవడం లేదా గాయాల పాలు కావడం జరుగుతుందని వాటిని నివారించుటకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర గోరక్షణ సమాఖ్య అధ్యక్షులు జి. రామకృష్ణ మాట్లాడుతూ జంతు సంరక్షణ కమిటీలను మండల స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. జంతు సంరక్షణ పట్ల పాఠశాల స్థాయి నుండే చైతన్య కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో బి లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి. రవికుమార్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి. శ్రీనివాసరావు, రవాణా, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.