నిరుపేదలకు శ్రీవారి ఉచిత దర్శనం..


Ens Balu
2
Tirumala
2021-09-21 11:39:13

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింద‌ని ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌ అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈఓ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈసారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే 9 రోజుల్లో రాష్ట్రంలో టిటిడి ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన 500 నుంచి 1000 మంది భ‌క్తుల‌ను బ‌స్సుల్లో ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్ డిపిపి, రవాణ విభాగం అధికారులను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వేద పారాయ‌ణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వ‌హించి బ‌హుమ‌తులు అంద‌జేయాలని అధికారులకు సూచించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై వ‌సంత మండ‌పంలో ప్ర‌ముఖ పండితుల చేత ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

          బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని బ్ర‌హ్మోత్స‌వాల లోపు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మ‌ర‌మ్మతులు పూర్త‌యిన కాటేజీల‌ను భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. వాహ‌నసేవలు జ‌రిగే ప్రాంత‌మైన ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో చిన్న బ్ర‌హ్మ‌ర‌థం ఏర్పాటు చేయాల‌న్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో భ‌క్తుల‌కు, విఐపిల‌కు ఇబ్బందులు లేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు సూచించారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని కూడ‌ళ్లు ఇత‌ర ముఖ్య‌మైన ప్రాంతాల్లో శోభాయ‌మానంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్న‌ప్ర‌సాదాల్లో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డెప్యూటీ ఈఓను ఆదేశించారు. వివిధ విభాగాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ప‌రిమిత సంఖ్య‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు. పారిశుద్ధ్యం చ‌క్క‌గా ఉండాల‌ని, క్ర‌మం తప్ప‌కుండా నీటి నాణ్య‌త‌ను ప‌రిశీలించాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌కు సూచించారు.

       అంతకుముందు టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, అక్టోబ‌రు 6న అంకురార్ప‌ణ జ‌రుగుతాయ‌ని, బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం, అక్టోబ‌రు 11న గ‌రుడ‌వాహ‌న‌సేవ‌, అక్టోబ‌రు 12న స్వ‌ర్ణ‌ర‌థం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 14న ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 15న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ స‌మావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు,  గోవిందరాజ దీక్షితులు, టిటిడి జెఈవో  స‌దా భార్గ‌వి, అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య‌, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఎఫ్ఏసిఏవో  ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  ట్రాన్స్‌పోర్టు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్  శేషారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్‌, హెచ్‌డిపిపి ప్రోగ్రామింగ్ అధికారి విజ‌య‌సార‌థి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి ఇత‌ర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.