గుర‌జాడ స్ఫూర్తిని భావిత‌రాల‌కు అందిస్తాం..


Ens Balu
3
Vizianagaram
2021-09-21 12:14:07

మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు త‌న ర‌చ‌న‌ల ద్వారా చెప్పిన సూక్తులు ఎప్ప‌టికీ అనుస‌ర‌ణీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అన్నారు. ఆయ‌న విజ‌య‌న‌గ‌రంవాసి కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు 159వ జ‌యంతి వేడుక‌లు మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ముందుగా గుర‌జాడ స్వ‌గృహంలోని ఆయ‌న చిత్ర‌ప‌టానికి, విగ్ర‌హానికి, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, శాస‌న స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, శాస‌న‌మండ‌లి స‌భ్యులు పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ‌, పెనుమ‌త్స సురేష్‌బాబు, మేయ‌ర్ వి.విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ రేవ‌తీదేవి, ఇత‌ర ప్ర‌ముఖులు, అధికారులు  పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం గుర‌జాడ స్వ‌గృహం నుంచి, మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల స‌మీపంలోని గుర‌జాడ కాంస్య విగ్ర‌హం వ‌ర‌కూ, మ‌హాక‌వి విర‌చిత‌ దేశ‌భ‌క్తి గీతాలాప‌న‌ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. గుర‌జాడ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. గుర‌జాడ గీతాల‌ను విద్యార్థులు శ్రావ్యంగా ఆల‌పించారు.

             ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు స్ఫూర్తిని భావిత‌రాల‌కు అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఆయ‌న సూక్తుల‌తో కూడిన బోర్డుల‌ను పాఠ‌శాల‌ల్లో, గ్రామ స‌చివాల‌యాల్లో ఏర్పాటు చేయ‌డం ద్వారా, గుర‌జాడ ఆశ‌యాల‌ను నేటి త‌రానికి వివ‌రిస్తామ‌ని చెప్పారు. మ‌హాక‌వి దేశ‌భ‌క్తి గేయాన్ని పాఠ‌శాల‌ల్లో ప్రార్ధ‌నాగీతంగా మార్చేందుకు కృషి చేస్తామ‌ని అన్నారు. గుర‌జాడ ప‌లుకులు నిత్య‌నూత‌న‌మ‌ని పేర్కొన్నారు. మ‌హాక‌వి వార‌సులుగా ఆయ‌న జ్ఞాప‌కాల‌ను ప‌దిల‌ప‌ర‌చ‌డానికి, ఆయ‌న ఆశ‌యాల సాధించేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

             ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, గుర‌జాడని స్మ‌రిస్తూ, ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు నిరంత‌రం కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌ పొరుగువాడికి సాయ‌ప‌డాల‌న్న‌దే మ‌హాక‌వి ప‌లుకుల‌ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. గుర‌జాడ వార‌సులుగా అది విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌కు అల‌వాటేన‌ని, ఆయ‌న బాట‌నే న‌డుస్తున్నామ‌న‌ అన్నారు. మ‌హాక‌వి గొప్ప‌ద‌నాన్ని చాటిచెప్పేందుకు, ఆయ‌న జ్ఞాప‌కాల‌ను ప‌దిల‌ప‌రిచేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. గుర‌జాడ అప్పారావు స్వ‌గృహాన్ని స్మార‌క చిహ్నంగా మార్చ‌డ‌మే కాకుండా, ఆ ప్ర‌క్క‌నున్న స్థ‌లాన్ని కూడా ప్ర‌భుత్వం కొనుగోలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. గుర‌జాడ కాంస్య విగ్ర‌హం ఉన్న ఐలండ్‌ను మరింత అభివృద్ది చేయ‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు  వెళ్ల‌డించారు. కుల‌మ‌త‌వ‌ర్గ విబేధాలు లేకుండా, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించ‌డం ద్వారా, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి సైతం గుర‌జాడ మార్గాన్ని అనుస‌రిస్తున్నార‌ని ఎంఎల్ఏ అన్నారు.

           ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, స‌మాజ ఉద్ద‌ర‌ణే మ‌హాక‌వి పలుకుల వెనుక‌నున్న ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. మ‌నిషి త‌న వ్య‌క్తిగ‌త స్వార్ధాన్ని విడిచిపెట్టి, దేశం కోసం కృషి చేయాల‌న్న‌ది గుర‌జాడ ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తి ఉన్నా లేకున్నా, ఆయ‌న సందేశం మాత్రం స‌మాజంలో చిర‌స్థాయిగా నిలిచిఉంటుంద‌ని అన్నారు.  క‌వులు, క‌ళాకారులు, సామాజిక వేత్త‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌కూడ‌ద‌ని కోరారు.

           గుర‌జాడ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, జిల్లా వ్యాప్తంగా పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్తృత్వం, అభిన‌య పోటీల విజేత‌ల‌కు అతిథుల చేతుల‌మీదుగా బ‌హుమ‌తులను అంద‌జేశారు.  ప్ర‌ధ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తుల‌ను వ్యాస‌ర‌చ‌న పోటీలో ఎ.కీర్త‌న‌(కెజిబివి, పార్వ‌తీపురం), ఎం.లీల (జెడ్‌పిహెచ్ఎస్‌, జొన్న‌వ‌ల‌స‌), కె.కిశోర్‌(జెడ్‌పిహెచ్ఎస్‌, మోపాడ‌) గెలుచుకున్నారు. వ‌క్తృత్వ పోటీలో పి.హేమాంజ‌లి (ఎపిఎంఎస్‌, కొత్త‌వ‌ల‌స‌), కె.శైలు(జెడ్‌పిహెచ్ఎస్‌, ర‌ఘుమండ‌), టి.మౌనిక (జెడ్‌పిహెచ్ఎస్‌, గొల్జాం) గెలుచుకున్నారు. మోనో యాక్ష‌న్ (అభిన‌యం) పోటీలో డి.రాకేష్ ప్రేమ్ (గుర‌జాడ ప‌బ్లిక్ స్కూల్‌), జె.ల‌లిత (హోలీక్రాస్ హైస్కూల్‌), బి.శ్రావ‌ణి (కెఎస్ఆర్ పురం) గెలుపొందారు. ప్ర‌ముఖ చిత్ర‌కారిణి ప్ర‌వ‌ల్లిక వేసిన గుర‌జాడ చిత్రాన్ని క‌లెక్ట‌ర్, ఎంఎల్ఏ ఆవిష్క‌రించారు. ఈ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా గుర‌జాడ వార‌సులు వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్‌, ఇంద‌ర‌ల‌ను స‌న్మానించారు.

           ఈ కార్య‌క్ర‌మంలో గుర‌జాడ వార‌సులు వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్‌, ఇందిర‌, ల‌లిత‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, జిల్లా ప‌ర్యాట‌కాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ ఏడి డి.ర‌మేష్‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, డిపిఎం బి.ప‌ద్మావ‌తి, డిపిఓ సుభాషిణి, డిఇఓ స‌త్య‌సుధ‌, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ శివానంద‌కుమార్‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడి వైవి ర‌మ‌ణ‌, బిసి కార్పొరేష‌న్ ఇడి ఆర్‌వి నాగ‌రాణి, మ‌హారాజా సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌వి ప్ర‌స‌న్న‌కుమారి, యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య త‌దిత‌ర అధికారులు, గుర‌జాడ సాహితీ స‌మాఖ్య కార్య‌ద‌ర్శి కోల‌గ‌ట్ల ప్ర‌తాప్‌, భీశెట్టి బాబ్జి, బి.శివారెడ్డి, డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు, స్వ‌రూప‌, ఎం.రామ్మోహ‌న్ త‌దిత‌ర వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు, నాయ‌కులు, విద్యార్థులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

క‌న్యాశుల్కం ప్ర‌ద‌ర్శ‌న‌

           మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు 159వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, స్థానిక మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో,  క‌న్యాశుల్కం నాట‌కంలోని బొంకుల‌దిబ్బ ఘ‌ట్టాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ ఘ‌ట్టాన్ని పూర్తిగా మ‌హిళ‌లే ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. గిరీశంగా బిహెచ్ సూర్య‌ల‌క్ష్మి, వెంక‌టేశంగా ఎస్‌.ఐశ్వ‌ర్య‌, ఫొటోగ్రాఫ‌ర్ పంతులు నౌక‌రుగా ఎస్‌.స‌త్య‌ల‌త అభిన‌యం ఆక‌ట్టుకుంది. ఈ నాట‌క ఘ‌ట్టానికి ఈపు విజ‌య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, సూర్య‌ల‌క్ష్మి నిర్వ‌హ‌ణా సార‌థ్యంలో జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి, ఎంఎల్‌సి పాల‌క‌పాటి ర‌ఘువ‌ర్మ‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌వి ప్ర‌సన్న‌కుమారి, డిపిఆర్ఓ డి.ర‌మేష్ త‌ద‌త‌రులు తిల‌కించారు.

వినూత్నం  - జూమ్ ద్వారా  గురజాడ గేయాలాపన
పాల్గొన్న 90 పాఠశాలల విద్యార్ధులు
              గురజాడ 159 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి వినూత్న ఆలోచన చేసారు.  కోవిడ్ ను దృష్టి లోపెట్టుకొని ప్రత్యక్షంగా విద్యార్ధులు పాల్గొన లేని పరిస్థితి ఉన్నందున వారందరిని జూన్ ద్వార పాల్గొని గురజాడ విరచిత గేయాన్ని  దేశమును ప్రేమించుమన్నా –మంచి యన్నది పెంచుమన్నా  ఒకేసారి సామూహికంగా ఆలపించే ఏర్పాటు చేసారు.  ముందుగా మహారాజా సంగీత కళాశాల  వారు పాడి  వినిపించగా తదుపరి అందరూ అదే  బాణీ లో పాడారు.  ఈ కార్యక్రమం లో  34 మండల ప్రధాన కేంద్రాల్లో నున్న పాఠశాలల, 5 మున్సిపల్, 25 కే జి బివి పాఠశాలల, 11 డిగ్రీ కళాశాలల విద్యార్ధులతో పాటు కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులు,  గిరిజన విశ్వ విద్యాలయం, సెంచూరియన్ విద్యార్ధులు,  6 ఇంజినీరింగ్  కళాశాలల విద్యార్ధులు , జిల్లా విద్య శాఖ, మున్సిపల్ కమీషనర్, సాంస్కృతిక కలశాల ల నుండి  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ  గురజాడ  గీతాన్ని ఆలపించిన తర్వాత విద్యార్ధులకు ఆ గేయం  అర్ధాన్ని, భావాన్ని అర్ధం అయ్యేలా ఉపాధ్యాయులు  వివరించాలని అన్నారు.  వినూత్నంగా అందరిని కలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులైన వారందరికి అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమం లో కలక్టరేట్ నుండి కలెక్టర్ తో పాటు జే. సి లు డా. కిషోర్ కుమార్, జే. వెంకట రావు, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, ఐ అండ్ పి ఆర్  ఎ.డి డి. రమేష్,  రాజీవ్ విద్య మిషన్ ప్రాజెక్ట్ అధికారి డి. కీర్తి తదితరులు పాల్గొన్నారు.