మైనార్టీ విద్యార్ధులకు ప్రభుత్వ స్కాలర్ షిప్పులు..
Ens Balu
2
Vizianagaram
2021-09-22 06:33:20
జాతీయ ఉపకార వేతనాలకోసం అర్హులైన మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. దీనికి సంబంధించిన కరపత్రాలను, ఫ్లెక్సీలను బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. నేషనల్ మైనారిటీ స్కాలర్‌షిప్పులు గురించి, వాటికి దరఖాస్తు చేసుకొనే విధానంపైనా విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించడం కోసం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.అరుణకుమారి మాట్లాడుతూ, నేషనల్ స్కాలర్‌షిప్పులకు ధరఖాస్తు చేసే విధానాన్ని, అర్హతలను వివరించారు. ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, జైనులు, సిక్కులు, పార్సీకులు తదితర మైనారిటీ విద్యార్థులు ఎన్ఎస్‌పి యాప్ ద్వారా లేదా, లేదా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్పులకోసం తల్లితండ్రుల వార్షికాదాయం రూ.లక్ష లోపు, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కోసం వార్షికాదాయం రూ.2లక్షల లోపు, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్పులకోసం వార్షికాదాయం రూ.2.5లక్షల లోపు ఉండాలని తెలిపారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులకు ఏడాదికి రూ.1000-రూ.5,000, పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రూ.6,000- రూ.12,000, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్పుల (వృత్తి విద్యాకోర్సులు) క్రింద రూ.25,000-రూ.30,000 వరకూ కేంద్రప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని వివరించారు. ఇతర వివరాలకోసం కలెక్టరేట్లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఏడి అరుణకుమారి సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, వివిధ మతాల పెద్దలు ఎంఎస్ఎస్ భాషా, ఆర్.ఎస్.జాన్, ఎం.పాల్‌సన్, బిషప్ డాక్టర్ కెజె ఫిలోనియన్, ఫాస్టర్ సునీల్, వి.జాన్ వెస్లీ, జస్వీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.