తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద దాత శేఖర్‌రెడ్డి రూ.15 కోట్ల విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని గోమందిరం, పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి, డిపిడబ్ల్యు స్టోర్స్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోమందిరంలో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బర్డ్ ఆసుపత్రి ఆవరణంలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులు పూర్తయ్యాయని, వైద్య పరికరాలు సమకూర్చుకుని, వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా, పంచగవ్య ఉత్పత్తుల తయారీకి తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవో వెంట టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, బర్డ్ సిఎస్ ఆర్ఎంవో శేషశైలేంద్ర, ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి, సిఎంవో డాక్టర్ మురళీధర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి, ఎస్ఇలు జగదీశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, విజివో మనోహర్ ఉన్నారు.