టిటిడి జారీ చేసిన అక్టోబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్‌తో టిటిడి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేయడంపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన దుష్ప్రచారాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఖండించారు. జియో సంస్థ సేవా భావంతో ముందుకొచ్చిందని, ఈ అంశాన్ని రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. జియో సంస్థ క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా ఒకటిన్నర గంట వ్యవధిలోనే సమర్థవంతంగా 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శన టికెట్ల బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు జియో సంస్థ దాదాపు రూ.3 కోట్లు విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని టిటిడిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. భక్తులు, తిరుపతి ప్రజలు, టిటిడి ఉద్యోగుల ఆరోగ్యభద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.
దర్శన టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎదురైన సాంకేతిక సమస్యలపై భక్తుల నుండి పలు సూచనలు, ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని టిటిడి ఐటి విభాగం, టిసిఎస్ సంస్థల సహకారంతో పరిష్కరించినట్టు చెప్పారు. అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా పలు మార్గాలను అన్వేషించామని, ఇందులో భాగంగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను వినియోగించుకునేందుకు అమెజాన్, జియో, బుక్ మై షో, అభిబస్ లాంటి సంస్థలను సంప్రదించామని వివరించారు. వీరిలో జియో సంస్థ రూ.3 కోట్లు విలువైన క్లౌడ్ సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. అయితే tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో సమయాభావం వల్ల జియో మార్ట్ సబ్ డొమైన్ వినియోగించాల్సి వచ్చిందన్నారు. వచ్చే నెలలో పూర్తిగా టిటిడి డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని చెప్పారు. టిటిడి మంచి ఉద్దేశంతో భక్తులకు టికెట్ల జారీ ప్రక్రియను ఎంతో చక్కగా అమలుచేస్తుండగా, కొంతమంది అదేపనిగా సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వివిధ మాధ్యమాలలో అవాస్తవాలు ప్రచారం చేయడం సబబు కాదని ఆయన అన్నారు.