చిల్డ్రన్స్ థియేటర్ లో పర్యాటక దినోత్సవం..


Ens Balu
3
Visakhapatnam
2021-09-24 13:33:46

విశాఖలో ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వి.ఎమ్.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయం పై మంత్రి స్థానిక సర్క్యూట్ హౌస్ లో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా, స్టేక్ హోల్డర్స్ అయిన హోటల్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇన్వెస్టర్స్, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరిని కలుపుకుని పర్యాటక రంగాన్ని, పర్యాటక ప్రదేశాలను అభివృద్థి చేస్తామన్నారు. పర్యాటక రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి “అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ” ఇవ్వడం జరుగుతుందన్నారు. పర్యాటక రంగాన్ని “ఆర్గనైజ్డ్ సెక్టార్” గా అభివృద్థికి కృషి చేస్తామని తెలిపారు. టూరిజం ఆపరేటర్లను శాఖాపరంగా రిజిస్ట్రేషన్లు గావిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల అభివృద్థికి ప్రైవేట్ ఆపరేటర్స్ ను ప్రోత్సహిస్తామన్నారు. పర్యాటక దినోత్సవం రోజున ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా  సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇన్వెస్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వి.ఎమ్.ఆర్.డి.ఎ. టూరిజం ప్రాంతాలలో ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు.పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు కాంపిటేషన్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద సముద్రతీరం ఉందన్నారు. రాష్ట్రంలో  ప్రకృతి సహజమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. అందరి భాగస్వామ్యంతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.ఆర్.డి.ఎ. ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె.రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, పైడా కృష్ణ ప్రసాద్ ఎ.పి.ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, హోటలియర్స్ అసోసియేషన్స్ సెక్రటరీ పవన్ కార్తీక్, ఎ.పి.టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.