ఉత్తమ ప్రజాసంబంధాలను నెలకొల్పడంలో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడంలో భారత ప్రజా సంబంధాల సంఘం (పి.ఆర్.ఎస్.ఐ) విశాఖ శాఖ గత 3 దశాబ్థాలుగా విశేషకృషి చేస్తూ వస్తోందని పిఆర్ఎస్ఐ విశాఖ శాఖ మాజీ అధ్యక్షుడు, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (డి.సి.ఐ.) విశ్రాంత అధికారి కె.రామారావు పేర్కొన్నారు. పి.ఆర్.ఎస్.ఐ. విశాఖ శాఖ ఆదివారం హోటల్ దసపల్లా లో నిర్వహించిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. పి.ఆర్.నిపుణులు కాలానుగుణంగా వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విశాఖ శాఖ ఛైర్మన్ పి.ఎల్.కె.మూర్తి మాట్లాడుతూ, కోవిడ్19 సమయంలో సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని ప్లాస్మా దాతలను గుర్తించి అవసరమైన వారికి అనుసంధానం చేయడం, మాస్క్ లు, శానిటైజర్లు,
ఆహర పదార్థాల పంపిణీతో పాటు పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వైస్ ఛైర్మన్ ఆర్.పి.శర్మ మాట్లాడుతూ, విశాఖలోని ప్రభుత్వరంగ సంస్థల అధికారులకు త్వరలో వివిధ అంశాలపై వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యదర్శి ఎమ్.కె.వి.ఎల్.నరసింహం మాట్లాడుతూ, సంస్థ తరపున ప్రజా సక్షేమానికి ప్రభుత్వాలు తీసుకునే పలు నిర్ణయాలు ప్రజలకు అర్థం అయ్యేవిధంగా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కోశాధికారి ఎన్.వి.నరసింహం విశాఖ శాఖ వ్యయ ప్రణాళికను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఎస్.ఐ. దక్షిణ భారత విభాగం ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ జాతీయ స్థాయిలో విశాఖ శాఖకు పేరు ప్రఖ్యాతులు రావడం వెనక ప్రస్తుత, గత కార్యవర్గం చేసిన కృషి ఉందన్నారు. సభ్యుల సంఖ్య పెరిగేలా కృషిచేయాలని, విద్యార్థులకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా యువత పాత్ర పెరుగుతుందని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలో శాఖ బలోపేతానికి పలువురు సభ్యులు సూచనలు చేశారు. సంస్థ మాజీ అధ్యక్షుడు కె.రామారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.పి.సి. పీఆర్వో టి.మల్లయ్య, కాయర్ బోర్డు మేనేజర్ వెంకట్రామన్, సీనియర్ సభ్యులు వై.శ్రీనివాసకుమార్,పి.ఎస్.ఎన్.మూర్తి, బి. విక్రమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.