బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఈ అర్ధరాత్రికి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం- ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఈ తుఫాను ప్రభావం జిల్లాపై అవకాశం వుంటుందని అందువల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. తుఫాను వల్ల 80 కిలోల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుందని దీని కారణంగా చెట్లు పడిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగడం, విద్యుత్ స్థంభాలు కూలిపోవడం వల్ల సరఫరాకు అంతరాయం వంటి సమస్యలు ఏర్పడతాయని, ఇలాంటి ఇబ్బందులు ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సంబంధిత అధికారులు సిద్ధంగా వుండాలన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఈ తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం వుంటుందన్నారు.
తుఫాను సన్నద్ధతపై జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను విపత్తుల కమిషనర్ ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పరంగా చేపట్టిన ముందస్తు చర్యలను జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి కమిషనర్‌కు వివరించారు. విద్యుత్ స్థంభాల పునరుద్దరణ కోసం జిల్లాలో 2 మాత్రమే డ్రిల్లర్‌లు ఉన్నాయని, మరో2 డ్రిల్లర్లు వుంటే విద్యుత్ స్థంభాల పునరుద్దరణ పనులు వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం మాత్రమే నమోదు అయ్యిందన్నారు. ఎలాంటి నష్టాలు సంభవించలేదన్నారు. రోడ్లు భవనాల శాఖకు విపత్తుల సమయంలో చెట్లను తొలగించడంలో ఉపయోగపడే అధునాతన పరికరాలు, యంత్రాలు సరఫరా చేశామని, వాటిని వినియోగించి తుఫాను అనంతర పరిస్థితుల్లో రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ కన్నబాబు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు విపత్తులను ఎదుర్కోవడంలో తగిన శిక్షణ ఇవ్వడం, తీర గ్రామాల ప్రజలకు తుఫానులు ఎదుర్కోవడంపై అవగాహన కలిగించడం ద్వారా విపత్తులను సమర్ధంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఆ సమయంలో ఇళ్లలోంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలను సిద్ధంచేశామని జిల్లా ఎస్.పి. ఎం.దీపిక వివరించారు. జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు యంత్రాంగం చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తంచేస్తూ గులాబ్ తుఫానును సమర్ధంగా ఎదుర్కోగలదనే విశ్వాసం తనకుందని కమిషనర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, జె.వెంకటరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరక్టర్ పద్మావతి, మునిసిపల్ కమిషనర్ వర్మ, గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. శివానంద ప్రసాద్, జిల్లా ఫైర్ ఆఫీసర్ జె.మోహనరావు, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు.
మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సమీక్ష..
జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై కూడా ఆ శాఖ కమిషనర్ గా వ్యవహరిస్తున్న కె.కన్నబాబు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో చర్చించారు. స్థానికంగా లభించే మత్స్య ఉత్పత్తులను వినియోగించేలా ప్రోత్సహించాలని, మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మత్స్య ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, చెరువుల్లో చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వివరించారు.