పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు..


Ens Balu
3
Gajapatinagaram
2021-09-27 11:39:49

పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం పలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. గజపతినగరం సమీపంలోని పురిటిపెంటలో, తుఫాను బాధితులకోసం బాలికల పాఠశాలలో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. పాల్తేరు కల్యాణమండపం సమీపంలో, చంపావతి నదిని ఆనుకొని, పురిపాకల్లో నివాసం ఉంటున్న 16 మందికి, ముందుజాగ్రత్త చర్యగా అక్కడినుంచి తరలించి, ఈ కేంద్రంలో పునరావాసం కల్పించారు.  బాధితులతో ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికీ కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయంపై ఆరా తీశారు. బాధితులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.  ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్డీవో బిహెచ్ భవానిశంకర్, తాసిల్దార్ అరుణకుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.