పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా పర్యాటక శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. సెప్టెంబర్ 27, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పై మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో ముందుగా టూరిజం ప్యాకేజీకి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీ విజయ దర్శిని ని ప్రారంభించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ఇతర వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీ ద్వారా పర్యాటకులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం సర్క్యూట్ లలో పర్యాటక అభివృద్ధి కి అనుకూల ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి పరిచి పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పర్యాటకానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి పి.ఎన్.వి. లక్ష్మినారాయణ, ఎన్. ఐ. సి. అధికారులు నరేంద్ర, బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.