నష్ట పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం..


Ens Balu
3
Srikakulam
2021-09-28 09:56:08

శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుఫాను లో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం  అన్నారు బుధవారం తుఫాను లో నష్టపోయిన పొందూరు మండలంలోని రెడ్డి పేట, దల్లి పేట, బానాం, చిన కొంచాడ, రెల్లిగెడ్డ లను పరిశీలించారు. గులాబ్ తుఫానుకు బొప్పాయి, అరటి, మొక్క జొన్న తదితర ఉద్యాన పంటలు బాగా నష్టపోయాయని తెలిపారు. ఉద్యాన పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పారు. నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఆయన వివరించారు. నష్ట పోయిన రైతులకు సముచిత పరిహారం అందించుటకు కృషి చేస్తామని అన్నారు. బొప్పాయి కిలో ధర రూ.17 ఉండగా, ప్రస్తుతం రూ.3 నుండి 6 ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు దీనమైన పరిస్థితికి చేరుకున్నారని ఆయన చెప్పారు. అధికార బృందాలు జిల్లాలో పర్యటించి ప్రతి రైతు నష్టపోయిన పంట వివరాలను, ఇతర ఆస్తులు వివరాలు నమోదు చేస్తారని ఆయన వివరించారు. ఈ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొని వాస్తవ వివరాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల నష్ట పరిహారం అందడంలో సమస్య ఉండరాదని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని, అన్యాయం ఎక్కడా జరగరాదని స్పీకర్ వివరించారు. సర్వే పక్కాగా జరగాలని ఆయన ఆదేశించారు. రైతులు కష్టాల్లో ఉన్నారని ఆ సమయంలోనే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని,  వారి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నారాయణపురం ప్రాంతంలో వరి నీట మునిగి ఉందని వివరించారు. రెల్లి గడ్డ పనుల్లో నాణ్యత లోపంతో గతంలో చేయడం వలన ప్రస్తుతం రైతులు నష్టోతున్నారని స్పీకర్ సీతారాం అన్నారు.  పూర్తిస్థాయిలో నిర్మించి రైతులకు ఇస్తామని అన్నారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాల అవసరం మేరకు గుర్తించి ప్రతిపాదిస్తామని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కాంతారావు, ఎంపీపీ ఉషారాణి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె .శ్రీధర్, స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.