ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు..


Ens Balu
8
Srikakulam
2021-09-28 09:59:50

శ్రీకాకుళం జిల్లాలో ‘‘గులాబ్ తుఫాన్” వలన నాగావళి నది ముంపు ప్రాంతాల ప్రజల తరలింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నాగావళి నదిలో నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందని, తద్వారా లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. మహిళా మండల వీధి, తురాయి చెట్టు వీధి,వైష్ణపు వీధి,లెప్రసీ కాలనీ, హెచ్‌.బి.కాలనీ,మంగువారితోట తదితర నాగావళి ముంపు ప్రాంతాలను మంగళవారం ఉదయం స్వయంగా సందర్శించారు.  వరద నీరు నగరంలోని లోతట్టు ప్రాంతాలలో చేరుతున్నందున ఇంజిన్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.  నాగావళి నది ఉధృతి మరింతగా ఉండే అవకాశం ఉన్నందున సదరు ప్రాంత ప్రజలకు పునరావాసా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం ఎన్.టి.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల, మంగువారి తోట నగర పాలక ప్రాథమిక పాఠశాల, టి.పి.ఎం. నగర పాలక ఉన్నత పాఠశాలలను సిద్ధం చేయడం జరిగిందని, ముంపు ప్రాంతాల ప్రజలు వారి దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని ఆయన ముంపు ప్రాంతాల ప్రజలను కోరారు.