తీరప్రాంత భద్రతపై మరింతగా ద్రుష్టిసారించాలి..
Ens Balu
3
Vizianagaram
2021-09-30 13:08:30
విజయనగరం జిల్లాలో తీరప్రాంత భద్రతలో భాగస్వామ్యం కలిగిన అన్ని పక్షాల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో తీరప్రాంత భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. తీరప్రాంత భద్రత విషయంలో మత్స్యకారులతో సమన్వయ పరచాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. నిర్మలకుమారికి సూచించారు. తీరప్రాంతంలో అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవడం వంటి అంశాల్లో మత్స్యకారుల సహకారం తీసుకోవలసి వుందన్నారు. భద్రతా సంస్థలు తీరప్రాంతంలో నివసించే మత్స్యకారులకు హైసెక్యూరిటీ గుర్తింపుకార్డులు జారీచేయడం ద్వారా కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవచ్చన్నారు. మత్స్యకారులకు వి.హెచ్.ఎఫ్. పరికరాలు అందజేసి తద్వారా సముద్రం నుంచి తీరప్రాంతానికి బోట్లలో వచ్చే వారి సమాచారం తెలుసుకోవడం, సముద్రంలో జరిగే ప్రమాదాలు, ఇతర సంఘటనల గురించిన సమాచారం తెలుసుకొనే వీలుంటుందని పేర్కొన్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లిలోని మెరైన్ పోలీసు స్టేషన్‌కు ప్రహారీగోడ నిర్మాణం, ఇతర వసతుల కల్పనపై చర్చించారు. మత్స్యకారులు వి.హెచ్.ఎఫ్. సెట్ల ద్వారా ప్రమాదాలు, ఇతర సమాచారాన్ని తీరరక్షణ దళం(కోస్ట్ గార్డ్)కు తెలియజేయవచ్చని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన తీరప్రాంత భద్రతకు సంబంధించిన సమావేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్, తీరరక్షణ విభాగం అడిషనల్ ఎస్పీ విమలకుమారి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, డి.ఎస్.పి. అనిల్ కుమార్, మత్స్యశాఖ డి.డి. నిర్మలాకుమారి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.