ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్‌పై ఇంటింటి సర్వే..
Ens Balu
4
Vizianagaram
2021-10-01 08:40:24
విజయనగరం జిల్లాలో పేరుకుపోయిన గృహనిర్మాణ రుణాలకు సంబంధించి, ప్రభుత్వం ప్రకటించిన ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని అమలు చేసేందుకు యుద్దప్రాతిపదికన ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ నుంచి తక్షణమే లబ్దిదారుల జాబితాలను తీసుకొని, సచివాలయాల వారీగా విడదీయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్లు, వివిధ మండలాల తాశీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, గృహనిర్మాణశాఖ అధికారులతో, శుక్రవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఓటిఎస్ పథకం గురించి ముందుగా లబ్దిదారులకు వివరించి, దానిని వినియోగించుకొనేలా చూడాలన్నారు. గతంలో రుణం తీసుకున్న లబ్దిదారుల జాబితాలను ఇప్పటికే ఆన్‌లైన్లో ఉంచడం జరిగిందన్నారు. ఈ జాబితాలను తీసుకొని, సచివాలయాల వారీగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఆయా సచివాలయాలకు జాబితాలను పంపించి, వలంటీర్లు, ఇతర సిబ్బంది చేత ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రుణం తీసుకున్నవారు, తీసుకున్న రుణాన్ని తీర్చేసిన వారు, ఇతరులకు ఇళ్లను విక్రయించిన వారు, ఆ ప్రదేశం నుంచి వలస పోయిన వారు ఇలా వివిధ కేటగిరీలను రూపొందించాలని సూచించారు. ఈ నెల 4 నుంచి సర్వే ప్రారంభించి, 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. సకాలంలో సర్వే పూర్తి చేయించే బాధ్యత తాశీల్దార్లు, ఎంపిడిఓలదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, మయూర్ అశోక్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిప్యుటీ సిఇఓ కె.రామచంద్రరావు, డిపిఓ సుభాషిణి, తాశీల్దార్లు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.