విజయనగరం జిల్లాలో మండలం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో అక్టోబరు 2న మహాత్ముని జన్మదినం సందర్భంగా గాంధీ జయంతి వేడుకలు తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ కార్యాలయ కాంప్లెక్స్‌లో కార్యాలయాలు కలిగిన ప్రభుత్వ శాఖల అధికారులు శనివారం ఉదయం 10.30 గంటలకు తమ సిబ్బందితో సహా కలెక్టరేట్ ఆవరణలోని గాంధీజీ విగ్రహం వద్ద నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని పేర్కొన్నారు. అన్ని చోట్ల కోవిడ్ నిబంధనలు అనుసరించి వేడుకలు నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు.