అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మూల విరాట్‌కు, ఉత్సవర్లకు, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, జయవిజయులకు, గరుడాళ్వార్‌కు, శ్రీ ఆంజనేయస్వామివారికి, ధ‌్వజస్తంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. కాగా రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు, కంకణబట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.