ధర్మ ప్రచారం కోసం గీతాగాన యజ్ఞం పోటీలు..
Ens Balu
4
Tirupati
2021-10-04 11:26:55
సనాతన ధర్మప్రచారంలో భాగంగా భగవద్గీతలోని 700 శ్లోకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు త్వరలో గీతాగాన యజ్ఞం పేరిట శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం అర్చకస్వాముల సాయంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వ్రత విధానానికి రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు భక్తులతో శ్రీ వేంకటేశ్వర నామకోటి రాయించాలని, ఇందుకోసం పుస్తకాలు సిద్ధం చేసుకోవడం, వాటిని భద్రపరచడం తదితర అంశాలతో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో భక్తులు సంచరించే అలిపిరి, ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలు పెంచాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గల 516 గోశాలలను టిటిడి గోసంరక్షణశాలకు అనుసంధానం చేసి త్వరలో వర్చువల్ సమావేశం నిర్వహించాలన్నారు. టిటిడి తయారు చేస్తున్న అగరబత్తులకు భక్తుల నుండి డిమాండ్ ఉందని, ఉత్పత్తి మరింత పెంచాలని గోశాల అధికారులను ఆదేశించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారంతో డ్రైఫ్లవర్ టెక్నాలజీ ద్వారా స్వామి, అమ్మవార్ల ఫొటోలు, క్యాలెండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు త్వరితగతిన తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దేశీయ గోవుల కొనుగోలు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ సభ్యులు ఉత్తర భారతదేశంలో పర్యటించి గోవులను కొనుగోలు చేయాలని ఈవో ఆదేశించారు. ఉద్యోగులకు ప్రతి సంవత్సరం వైద్యపరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని వైద్య విభాగం అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదీ నాటికి టిటిడి ఉద్యోగులందరికీ నూతన గుర్తింపు కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు.