మానవ వనరుల వినియోగం మరింత పెంచాలి..
Ens Balu
6
Visakhapatnam
2021-10-04 15:28:32
గిరిజన సహకార సంస్థలో నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలంటే శతశాతం మానవనరుల వినియోగాన్ని పెంచి ప్రణాళికా ప్రకారం ముందుకి వెళితే ఫలితాలు వస్తాయని జిసిసి చైర్మన్ డా.శోభస్వాతీరాణ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని జిసిసి సమావేశ మందిరంలో ఎండీ పీఏశోభ, ఇతర డివిజనల్ మేనేజర్లలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. జిసిసి ఉత్పత్తులపై అన్ని వర్గాల ప్రజలకు అపార నమ్మకం వచ్చేవిధంగా నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేయాలన్నారు. జిసిసి ద్వారా గిరిజనులకు సకాలంలో నిత్యవసర వస్తువులు అందించాలన్నారు. పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో అక్రమాలు జరగకుండా చూడాలని, అలాంటివి గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, ఇతర ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల వద్ద జిసిసి స్టాల్స్ ను ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు సరుకులు తరలించే విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి కేంద్రాల జాబితా జెసి, ఐటీడీఏ పీఓ ద్వారా సకాలంలో తీసుకొని వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చే విషయంలో సత్వరమే స్పందించి గిరిజనులకు అండగా నిలవాలన్నారు. అటవీ ఫలసాయాల కొనుగోలు 523 లక్షల టార్గెట్ కు 242 లక్షలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడంపై చైర్మన్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యం కంటే అధికంగా కొనుగోలు జరిగేలా చూడాలని జిసిసి ఎండీకి సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మేనేజర్లు, సొసైటీ మేనేజర్లు పాల్గొన్నారు.