ఓటరు సవరణకు రాజకీయపార్టీలు సహకరించాలి..
Ens Balu
12
Kakinada
2021-10-04 16:21:58
ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)-2022 కార్యక్రమం ద్వారా దోషరహిత ఓటరు జాబితాల రూపకల్పన ప్రక్రియ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కోరారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, కొత్తగా ఓటర్ల నమోదు తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్.. అధికారులతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాదుతూ ప్రస్తుతమున్న 4,597 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో నాలుగు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-ఏపీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)-2022 కింద నవంబరు 1వ తేదీన ఇంటిగ్రేటెడ్ ఓటరు జాబితాల ముసాయిదాలను ప్రచురించి, అప్పటి నుంచి నవంబరు 30 వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు మాన్యువల్ విధానంతో పాటు ఎన్‌వీఎస్‌పీ పోర్టల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (వీహెచ్ఏ)లను ఉపయోగించుకోవచ్చన్నారు. 2022, జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రచురణ జరగనుందన్నారు. 2022, జనవరి 1 అర్హత తేదీగా కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని, నవంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. నవంబర్ 20, 21 తేదీలను స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌గా గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకునేలా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. 2022, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న విద్యార్థులు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు వీలుగా అవగాహన కల్పించేందుకు ఈ నెల 7, 27వ తేదీల్లో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హరికిరణ్.. అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ (కలెక్టరేట్) ఎం.జగన్నాథంతో పాటు కె.పోతురాజు (ఐఎన్‌సీ), సీహెచ్ రమేశ్ (బీజేపీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజశేఖర్ (సీపీఐ-ఎం), టి.రమేశ్ (టీడీపీ), ఆర్.వెంకటేశ్వరరావు (వైఎస్సార్ సీపీ) తదితరులు పాల్గొన్నారు.