బాలికల ఆరోగ్య పరిశుభ్రతే ప్రభుత్వ ధ్యేయం..


Ens Balu
2
Srikakulam
2021-10-05 07:50:03

బాలికల ఆరోగ్య పరిశుభ్రతే ధ్యేయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చిన్న కారణాల వలన విద్యలో వెనుకబాటు ఉండరాదని, విద్యకు స్వస్తి పలుకరాదని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళ వారం ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా కిషోర బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 7 నుండి 12 వ తరగతి వరకు గల కిషోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏదాదికి 120 నాప్కిన్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు దాదాపు రు 32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 23 శాతం మంది బాలికల చదువులు ఆగిపోవడానికి నెలసరి పీరియడ్స్ లో ఏర్పడుతున్న ఇబ్బందులు కారణమని ఐక్యరాజ్య సమితి పారిశుధ్య విభాగం నివేదిక తెలియజేసింది. ఈ అంశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వయస్సు పరంగా వస్తున్న మార్పుల పట్ల అరోగ్య పరంగా తీసుకోవలసిన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు చైతన్యం కల్పించాలని అన్నారు. దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం పట్ల కూడా ప్రతి నెల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఒక మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు నోడల్ అధికారిగా నియమించడం జరుగుతోందని చెప్పారు. పర్యావరణ హితంగా డిస్పొజ్ చేయుటకు. రాష్ట్రంలో 6417 ఇన్సినేటర్లు ద్వారా డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళంలో   ఏవియన్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 22 లక్షల శానిటరీ నాప్కిన్ లు సరఫరా అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 5,742, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 2,731, ప్రాథమిక, ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాటశాలల్లో చదువుతున్న 60,391 మంది వెరసి 68,864 మందికి పంపిణీ చేశామన్నారు. శారీరక పరిశుభ్రత గూర్చి అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఇన్ ఛార్జ్ డిఇఓ జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి తిరుమల చైతన్య, పి.ఇందిరామణి, తదితరులు పాల్గొన్నారు.