శ్రీకాకుళంజిల్లాలో గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఉండబోదని జేపీ గ్రూప్ స్పష్టం చేసింది. జిల్లాలో ఇసుక పరిస్థితిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, జేపీ గ్రూప్ తో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మంగళవారం ఉదయం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక కొరత ఎక్కడ ఉండరాదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇసుక ఉత్పాదనలో ముందు వరుసలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకుని ఇసుక సరఫరాలో ఎటువంటి సమస్యలు, లోపాలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇసుక రీచ్ లలో లేదా ఇసుక స్టాక్ పాయింట్ లో సమస్యలు, నిర్వహించలేని పరిస్థితి ఉంటే దాన్ని వ్రాతపూర్వకంగా సమర్పించాలని వాటిని అవసరం మేరకు ప్రభుత్వ విభాగాల ద్వారా నిర్వహించుటకు చర్యలు చేపడతామని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 26 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఎక్కడ సమస్య ఉన్నా తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణం, గృహ నిర్మాణాలకు వచ్చే వాహనాలకు ప్రత్యేక వరుస ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇసుకకు వచ్చే వాహనాలకు టోకెన్లు ఉండాలని, వెళ్లే సమయం, గమ్యస్థానానికి చేరే సమయం, వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా టోకెన్ లో ముద్రించాలని ఆయన సూచించారు. ప్రతి రీచ్ వారీగా పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. టెక్కలిలో గురు వారం నాటికి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే వాటిని దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉంచరాదని, వాటిని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావడం వలన అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. గనుల శాఖ, ఎస్.ఇ.బి సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక వరసలు ఉండటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. జేపీ గ్రూప్ సీఈఓ వి.ఎం.విష్ణునాథ్ మాట్లాడుతూ జిల్లాలో 19 రీచ్ లలో మ్యాన్యువల్ నుండి యంత్రాలు ఉపయోగించుటకు అనుమతులు కోరామన్నారు. గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.జగనన్న గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక కొరత ఉండబోదని ఎప్పటికప్పుడు ఇసుక సరఫరా చేయుటకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ప్రదర్శించనున్నారని, అదే అంశాన్ని ప్రజలకు పత్రికల ద్వారా తెలియజేయుటకు కూడా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. కనీస ధరతో గమ్య స్థానం వరకు చేరుటకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. టెక్కలి లో దేవదాయ శాఖ భూమిలో స్టాక్ పాయింట్ నిర్వహించడం జరుగుతుందని, మరో రెండు సంవత్సరాలు నిరభ్యంతర పత్రం జారీ ద్వారా స్టాక్ పాయింట్ నిర్వహించే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఈబి ఏఎస్పి కే. శ్రీనివాసరావు, గనుల శాఖ ఉపసంచాలకులు సిహెచ్ . సూర్య చందర్రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.గణపతి, ప్రజా ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. సుగుణకరరావు, వివిధ శాఖల ఇంజనీర్లు, జేపీ గ్రూప్ మేనేజర్ ఎన్. గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.