శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు..


Ens Balu
2
Tirumala
2021-10-05 10:26:45

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణంకు ఊప‌యోగించే దర్భ చాప, తాడును వ‌రా‌హ‌స్వామి అథితి గృహా‌ల వ‌ద్ద ఉన్న టిటిడి అట‌వీ విభాగం కార్యాల‌యం నుండి మంగ‌ళ‌వారం  డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, సిబ్బంది ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు. అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం రంగ‌నాయ‌కుల మండ‌పంలోని శేష‌వాహ‌నంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 7వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం  మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో  విష్ణు దర్బ ఉపయోగిస్తారు.  ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణంకు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.   ఈ కార్యక్రమంలో విజివో  బాలిరెడ్డి, ఎఫ్‌ఆర్‌వోలు  ప్ర‌భాక‌ర్‌రెడ్డి,  స్వామి వివేకానంద‌, వెంక‌ట‌సుబ్బ‌య్య‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌, గంగ‌రాజు పాల్గొన్నారు.