హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత..జిల్లా కలెక్టర్ జె.నివాస్


Ens Balu
3
Srikakulam
2020-09-11 20:01:11

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడి ఎస్ సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ పై వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాజిటివ్ కేసుల ప్రాథమిక కాంటాక్టులు హోమ్ క్వారంటీన్ లోనే ఉండాలని, హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటీన్ లో ఉన్నవారు విధిగా ఇంట్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారు బయటకు తిరగరాదని కలెక్టర్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో 3,920 మంది ఉన్నారని, రోజుకు 8 వందలు వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇచ్చి తగు పర్యవేక్షణ చేయాలని, మందుల కిట్లు అందించాలని ఆదేశించారు. అవసరమైన వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారిని తప్పనిసరిగా కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలని, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేసులు పెరగకుండా పర్యవేక్షణ చేయాలని, ఇంటింటి సర్వే చేస్తూ జ్వరం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని, పరీక్షల కిట్లకు జిల్లాలో కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎన్. అనురాధ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.జగన్నాధరావు, ఐసిడిఎస్ పథక సంచాలకులు డా. జి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు