సాంకేతికను రైతుల వద్దకు తీసుకువెళ్లాలి..


Ens Balu
11
Visakhapatnam
2021-10-05 13:39:24

ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులు అందుకునేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవన, మత్స్యశాఖలకు సంబంధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. గులాబ్ తుఫాను పంట నష్టాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన పంట విస్తీర్ణం సాధారణ విస్తీర్ణం లో 86% ఉన్నందున రికన్సిల్ చేసుకోవాలని సూచించారు. ముందుగా ఈ క్రాప్ పూర్తయితేనే పంట నష్టం, బీమా, రైతు భరోసా మొదలైనవన్నీ రైతులు పొందగలరని చెప్పారు. ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు శిక్షణలు పెంచాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది పనితనం మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.
రైతులకు మేలు చేసే కొత్త వంగడాలను గూర్చి అవగాహన కల్పించి ఉద్యానవన పంటలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. పట్టు పరిశ్రమ గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గిరిజన రైతులకు లోతైన సంపూర్ణమైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. 
ఎక్కువగా క్షేత్ర పర్యటనలు చేయాలని పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మొదలైన వాటికి తెగులు రాకుండా ముందుగా వ్యాక్సినేషన్, అవసరమైన జాగ్రత్తల గూర్చి తెలియజేయాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. జిల్లాలో మత్స్య పరిశ్రమ గురించి సమీక్షిస్తూ కేజ్ కల్చర్ ను మరింత అభివృద్ధి చేయాలన్నారు హేచరీలలోఉత్ప్రేరకాలను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎమ్. వేణుగోపాల రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి, పశుసంవర్ధక శాఖ జె.డి. రామకృష్ణ, మత్స్య శాఖ జే.డీ. లక్ష్మణరావు ఉద్యానవన శాఖ డి.డి.  పట్టు పరిశ్రమ శాఖ జె.డి. తదితరులు పాల్గొన్నారు