భావనపాడు పోర్టుతో ప్రయోజనం - డిప్యూటీ సీఎం
Ens Balu
2
Srikakulam
2020-09-11 21:51:33
భావనపాడు పోర్టు వలన జిల్లాకు ఎంతో ప్రయోజనకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు.భావనపాడు పోర్టు నిర్మాణంపై తయారు చేసిన డిపిఆర్ పై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రైట్స్ సంస్థ రూ.3669.95 కోట్లతో రూపొందించిన డిపిఆర్ ను ఆమోదించారని తెలిపారు. పోర్టు వలన జిల్లాకు ప్రత్యేకంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మొదటి దశలో 3 సాధారణ బెర్తులతో పాటు ఒక బల్క్ బెర్తు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో 9.18 మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. పోర్టు నిర్వాసితులతో సామరస్యధోరణిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా అభివృద్ధికి, ఆ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ బ్రేక్ వాటర్స్ ఉత్తరం వైపున ఫింగర్ జెట్టి ఒక దానిని ప్రతిపాదించాలన్నారు. తద్వారా దేవునళ్తాడ, భావనపాడు గ్రామస్తులు వినియోగించుకోగలరని చెప్పారు. పోర్టుకు రైల్వే కనెక్టివిటీ రానుందని అన్నారు. నిర్వాసితులకు, భూ సేకరణకు రూ.12 వందల కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దేవునళ్తాడ, భావనపాడు మధ్య గల తీర ప్రాంతం పోర్టు నిర్మాణానికి అత్యంత అనువైనదని చెప్పారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ జెట్టి నిర్మాణానికి కూడా సానుకూలంగా ఉందని అన్నారు. సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. డిపిఆర్ తయారీ సంస్థ రైట్స్ ఏజిఎం శర్వానంద్ మాట్లాడుతూ డిపిఆర్ ను గూర్చి వివరించారు. మొదటి దశలో 150 ఎకరాల్లో స్టోరేజి, మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు చత్తీస్ ఘడ్, జార్ఖండ్,దక్షిణ ఒడిషా తదితర రాష్ట్రాలు పోర్టు సేవలను ప్రధానంగా వినియోగించుకోగలవని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జేసీ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డిప్యూటీ కలెక్టర్ పి.అప్పారావు, సర్వే ఎడి ప్రభాకర్, మత్స్య శాఖ జెడి పివి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.