పెండింగు బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలి..


Ens Balu
4
Srikakulam
2021-10-05 14:21:16

శ్రీకాకుళం  జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలని, నెల రోజుల తదుపరి బిల్లులు పెండింగులో ఉంటే ఉపేక్షించేది లేదని  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత గృహ నిర్మాణాల జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన పెండింగు బిల్లులపై దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణపు పనులకు సంబంధించిన బిల్లులు వారంలోగా వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఇసుక, సిమెంటు, ఐరన్ సరఫరాపై ప్రతి లబ్ధిదారునికి వివరాలు తెలియజేయాలని, నిధులు లేవనే నెపంతో పనుల్లో జాప్యం జరగరాదని జె.సి స్పష్టం చేసారు. ప్రతి ఏ.ఇ.ఇ కూడా వారి  పరిధిలోని గ్రామ సచివాలయాలను తప్పనిసరిగా పర్యటించాలని, ప్రతి రోజూ 5 నుండి 10 మంది లబ్ధిదారులతో మాట్లాడి వారి గృహ నిర్మాణపు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.  గృహాలు మంజూరైన స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు బ్యాంకుల నుండి రుణాలు పొంది వాటిని పూర్తిచేసుకునే విధంగా విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సిమెంటు సరఫరా ఎక్కువగా ఉన్నచోట పనులు వేగవంతం చేయాలని, ఇసుక కొరత సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు జె.సి వివరించారు. 

తక్కువ గృహ నిర్మాణాలు చేపట్టిన  మండలాల్లో ఏ.ఇ.ఇలు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతీ మండలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న గృహనిర్మాణాలను పరిశీలిస్తామని అన్నారు. గృహ లబ్ధిదారుల పేర్లు మరియు వారి సెల్ ఫోన్ నెంబర్లు సంబంధిత ఏ.ఇ.ఇల వద్ద అందుబాటులో ఉండాలని, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సరైన స్పందన లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలని, నెల రోజుల తదుపరి పెండింగులో బిల్లులు ఉంటే ఉపేక్షించేది లేదని అన్నారు. గృహ నిర్మాణాల్లో సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. బిల్లులు చెల్లింపులు జరిగితే మరిన్ని నిధులు జిల్లాకు విడుదల అవుతాయని, దానివలన మరిన్ని గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం కలుగుతుందని జె.సి ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు ఎన్.గణపతి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.