తరతరాలు గుర్తుంచుకునేలా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి పటిష్ట వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని, రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్ ఉచిత పంటల బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏదైనా విపత్తు వల్ల పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ముందే చెప్పిన ప్రకారం పెట్టుబడి సాయం దగ్గరి నుంచి పంట నష్ట పరిహారం వరకు ప్రణాళిక ప్రకారం వివిధ కార్యక్రమాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చుతున్నట్లు వివరించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం వల్ల ఒక్క రూపాయి కూడా రైతుపై భారం పడదని.. పారదర్శకంగా, జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో మీటర్ల బిగింపు జరుగుతుందన్నారు. 96 శాతం మంది రైతులు దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బకాయిలు లేకుండా విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ఏ పంటకు ఎంత మద్దతు ధర అనే సమాచారాన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 2020-21లో రాష్ట్రంలో రైతుల నుంచి రూ.15,487 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. గతంలో మాదిరి బీమా ప్రీమియం చెల్లించనవసరం లేకుండా.. ఈ-క్రాప్ బుకింగ్ చేస్తే చాలు.. పంట బీమా అందుతుందన్నారు. 2019-20, 2020-21 రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతులకు మొత్తం రూ.3,716 కోట్ల మేర బీమా చెల్లింపులు చేసినట్లు తెలిపారు. రూ.15 వేల కోట్లతో గ్రామాల్లో మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని.. ఇందులో భాగంగా గ్రామీణ గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, కోల్డ్‌రూంలు, గ్రేడింగ్ యూనిట్లు తదితరాలు ఏర్పాటుకానున్నాయని వివరించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులకు విలువ జోడింపు లక్ష్యంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇందుకు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ అడ్వయిజరీ బోర్డులను ఏర్పాటు చేసి.. ప్రతి నెలా క్రమం తప్పకుండా రాష్ట్ర స్థాయి నుంచి ఆర్‌బీకే స్థాయి వరకు సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తోందంటే రైతుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రెండేళ్ల కాలంలో ఇప్పటి వరకు రూ.17,030 కోట్ల 23 లక్షలు నేరుగా అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, ప్రస్తుతం ఏడు లక్షల 38 వేల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్‌బీకేల ద్వారా ఎరువుల సరఫరా జరుగుతున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఓ అన్నగా ఆలోచించి.. బాధ్యతతో స్వేచ్ఛ వంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి అందరు విద్యార్థినుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహళల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. మహిళల భద్రతకు, అభివృద్ధికి రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. మహిళా సాధికారత కమిటీ తరఫున ఇటీవల 12 రాష్ట్రాల నుంచి దాదాపు 16 మంది ఎంపీలు విశాఖపట్నంలో పర్యటించారని.. దిశ బిల్లు గురించి తెలుసుకొని, అదే విధంగా రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను మెచ్చుకున్నారని ఎంపీ గీత వెల్లడించారు.