ఏడాదిలోగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవనం పూర్తి
Ens Balu
3
Srikakulam
2020-09-11 21:54:54
శ్రీకాకుళంజిల్లాలో ఏడాదిలోగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తికావాలని, ఇందుకు అన్ని క్రీడాసంఘాలు కలిసిరావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు మరియు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణ కార్యక్రమంపై ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధుల సమావేశం శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కొదవలేదని, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ లలో రాణించిన జాతీయ క్రీడాకారులు ఎందరో ఉన్నారని అన్నారు. అయితే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఇక్కడ తక్కువగా ఉన్నాయని, అందుకే జిల్ల్లాలో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులతో పాటు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవనం ఒకటి నిర్మించాలనేది తన తపన అని అన్నారు. భవన నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు ఖర్చుకాగలదని అంచనా వేయడం జరిగిందని, దాతలు, ప్రభుత్వ సహకారంతో వీలైనంత తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 13 లక్షల రూపాయలను తన వంతుగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడారంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, వీలైనంత త్వరలో శంకుస్థాపన పనులు చేపట్టాలని సూచించారు. శంకుస్థాపన మొదలు భవనం ప్రారంభమయ్యేంత వరకు పనులు నిరంతరంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. భవన నిర్మాణం పూర్తయితే అన్ని క్రీడాసంఘాలు ఒకే గొడుగు కిందకు వస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి అవసరమైన కమిటీలు ఏర్పాటుచేసుకొని ముందుకువెళ్లాలని అసోసియేషన్ సభ్యులను కోరారు. ఈ భవన నిర్మాణానికి ఛైర్మన్ గా మాజీమంత్రి , శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఒలింపిక్ అసోసియేషన్ భవనాలు తక్కువగా ఉన్నాయని, ఇటువంటి తరుణంలో జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం వలన రాష్ట్రానికి, జిల్లాకు గౌరవం వచ్చేవిధంగా తీర్చిదిద్దాలని, ఇందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మీరిచ్చిన గౌరవంతోనే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నానని, ఇదేస్పూర్తితో మీ అందరి అండదండలతో ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తికావాలని ఆకాంక్షించారు. అనంతరం తన వంతుగా లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని నగదు రూపంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.సుందరరావుకు ఉపముఖ్యమంత్రి అందజేసారు. అనంతరం ఈ సందర్భంగా భవన నిర్మాణానికి కమిటీలను ఏర్పాటుచేస్తూ, సావనీర్ ను కూడా రూపొందించాలని, దానికి నల్లి ధర్మారావు కన్వీనర్ గా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి ప్రతినిధులకు సూచించారు.
రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య శాఖామాత్యులు డా. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారులు ఉన్నారని, తన నియోజక వర్గంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన క్రీడాకారులున్నారని గుర్తుచేసారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారులను అన్నిరకాలుగా ఆదుకోవాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని, ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. కరోనా నేపధ్యంలో జిల్లాలో ఎటువంటి క్రీడలను నిర్వహించడం లేదని, రాబోయే రోజుల్లో ప్రతీ మాసం ఒక క్రీడ చొప్పున 12 మాసాలకు 12 రకాల క్రీడలను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్ కు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, శాసనసభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శిమ్మ రాజశేఖర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరి కృష్ణ, జూడో అసోసియేషన్ అధ్యక్షులు మెంటాడ స్వరూప్, ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు చిట్టి నాగభూషణరావు, హాకీ అసోసియేషన్ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సురిబాబు, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డా. చక్క నారాయణరావు, ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కొమర భాస్కరరావు, సాంబమూర్తి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.రమణ, సాధు శ్రీను, కలగ శ్రీనివాస్ యాదవ్,ఎం.ఎస్.శేఖర్, కె.రాజారావు తదితరులు పాల్గొన్నారు