ఏపీలో వైద్యరంగం మరింత బలోపేతం..


Ens Balu
9
విశాఖ సిటీ
2021-10-07 07:13:13

ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగాన్ని బలోపేతంచేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలోని ఛాతి ఆసుపత్రిలో,  పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి  ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల చెస్ట్ ఆసుపత్రిలో ఉన్న 300 బెడ్స్ కు గానూ 100 బెడ్స్ కు ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ప్రెషర్ స్వింగ్ అడ్సోప్షన్ (PSA plant) విధానంలో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేకుండా.. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. కేంద్రం 80 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల భాగస్వామ్యంతో మొత్తంగా.. 130 కోట్ల రూపాయలతో 1000 LPM సామర్థ్యం తో ఈ ప్లాంట్ నిర్మితమైందని అన్నారు. ఆధునాతనమైన ఈ ప్లాంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వైద్యం కోసం విశాఖపై ఆధారపడి ఉన్నాయని.. ఈ అవసరాలు గుర్తించే నగరంలోని ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుతం అభివృద్ధి చేస్తోందని అన్నారు. మొదటి వేవ్ లో  ఆక్సిజన్ సిలిండర్ల అవసరం అంతగా లేకపోయినా.. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో మరణాలు ఎక్కువగా సంభవించడం బాధాకరమని అన్నారు. థర్డ్ వేవ్ రాకూడదనే కోరుకుందామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులకు పూర్తి సన్నద్దంగా ఉందని అన్నారు. ప్రజలంతా  కరోనా నిబంధనలు పాటించాలని.. పండుగల సమయం కావడంతో ఎటువంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, వీఎం ఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, వైద్య శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ( ఐ పి ఎస్.ఎమ్ ఐ డి సి) ,  పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.