బోదవ్యాధి నిర్మూలించేందుకు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా, డిఇసి మాత్రలను వేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి కోరారు. స్థానిక డిఎంఅండ్‌హెచ్ఓ కార్యాలయం వద్ద, ఫైలేరియా నివారణ మాత్రలను మ్రింగించే కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంఅండ్‌హెచ్ఓ రమణకుమారి మాట్లాడుతూ, జిల్లాలో బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతీఏటా డిఇసి మాత్రల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకేసారి జిల్లాలోని అందరికీ మాత్రలను పంపిణీ చేసి, మ్రింగించడం ద్వారా, ఈ వ్యాధి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో కొన్ని చోట్ల ఫైలేరియా వ్యాధి ఉందని, వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు, శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నామని చెప్పారు. వ్యాధి వచ్చిన తరువాత బాధ పడేకంటే, ఇది రాకుండా ముందస్తుగా డిఇసి మాత్రలను తీసుకోవడం మేలని సూచించారు. జాతీయ కీటక నివారణా కార్యక్రమం (ఎన్‌విబిడిసిపి) డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ రామనాధం మాట్లాడుతూ, రెండు సంవత్సరాల లోపు వాళ్లు, గర్భిణిలు, కేన్సర్, అల్సర్, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ మందులు వాడకూడదని చెప్పారు. 2-5 ఏళ్లు మద్యవయసు వారు ఒక డిఇసి, ఒక ఆల్బెండజోల్, 6-14 మధ్య వయసువారు రెండు డిఇసి, ఒక ఆల్బెండజోల్ మాత్రలు, 15 ఏళ్లు పైబడినవారు 3 డిఇసి, ఒక ఆల్బెండజోల్ మాత్రలను తీసుకోవాలని సూచించారు.
జోనల్ మలేరియా అధికారి డాక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ, డిఇసి మాత్రలను ఆహారం తీసుకున్న తరువాత ఈ మాత్రమే మింగాలని సూచించారు. ఎవరికైనా కొద్దిగా జ్వరం, వాంతులు వచ్చేనట్టు అనిపించినా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో ఈ విడత 23,42,048 మందికి డిఇసి, ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీనికోసం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వలంటీర్లు, ఎఎన్ఎంతో 9,472 బృందాలను ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 948 మంది ఆరోగ్యసిబ్బందిని సూపర్‌వైజర్లుగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహన్, డిఐఓ డాక్టర్ నారాయణ, జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి, మలేరియా కన్సల్టెంట్ రామచంద్రుడు, అర్బన్ ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.