నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపండి..
Ens Balu
6
Kakinada
2021-10-07 14:22:08
నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని, పాత నేరగాళ్లపై నిశిత నిఘా ఉంచాలని.. పదేపదే నేరాలకు పాల్పడుతున్నవారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. నాటుసారా, అక్రమ మద్యం నియంత్రణ చర్యలపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్.. పోలీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దాడులను ముమ్మరం చేయాలని, జిల్లాలో సారా ఆనవాళ్లు లేకుండా చేయాలని ఆదేశించారు. సారా తయారీ స్థావరాలను గుర్తించి, ధ్వంసం చేయాలన్నారు. అటవీ ప్రాంతాలు, లంకలు, జిల్లా సరిహద్దులు తదితర ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అవసరమైతే సారా తయారీ స్థావరాలను గుర్తించేందుకు అత్యాధునిక డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. కీలక ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అక్రమ మద్యం రవాణాను నిర్మూలించాలని ఆదేశించారు. సముద్రం, నదుల ద్వారా కూడా అక్రమ మద్యం రవాణా అయ్యే అవకాశమున్నందున ఆ దిశగా కూడా దృష్టిసారించాలని, యానాం, తెలంగాణా సరిహద్దులపైనా నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. దేవీ నవరాత్రుల నేపథ్యంలో సారా తయారీ, రవాణా కార్యకలాపాలు పెరిగే అవకాశమున్నందున పటిష్ట ప్రణాళికతో వాటిని అడ్డుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయల పరిధిలోని మహిళా పోలీసులు, కార్యదర్శుల ద్వారా కాపు సారా తయారి, విక్రయాలపై సమాచారాన్ని సేకరించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ, కాకినాడ అదనపు ఎస్‌పీ కరణం కుమార్, రాజమహేంద్రవరం అదనపు ఎస్‌పీ కె.లతామాధురి; డీఎఫ్‌వో ఐకేవీ రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.