జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకులే కీలకం..
Ens Balu
6
Visakhapatnam
2021-10-07 14:50:16
ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పథకాలను అందజేయడంలో బ్యాంకులు ముఖ్య భూమికను పోషించాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంవత్సరిక రుణ ప్రణాళిక (Annual Credit Plan) అమలు పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, ఉపాధి, పారిశ్రామిక, డ్వాక్రా, పశుసంవర్ధక, మత్స్య, వాణిజ్య రంగాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు బ్యాంకుల తోడ్పాటు గురించి ఆయన సమీక్షించారు. బ్యాంకింగ్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో గ్రామ స్థాయి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆసరా’ పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నారని బ్యాంకులు వీరికి ఇతోధికంగా సహకరించాలన్నారు. జిల్లాలో నాబార్డ్ చేపడుతున్న కార్యక్రమాలను గూర్చిన కరదీపికను విడుదలచేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి పి.డి. డి.ఆర్.డి.ఎ. విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు, పశుసంవర్ధక జెడి రామకృష్ణ ఉద్యానవన శాఖ డిడి గోపీనాథ్, పరిశ్రమల శాఖ డి.ఎం. రామలింగరాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్ ప్రసాద్ వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.