లంబసింగి సిగలో చారిత్రిక మణిపూస..


Ens Balu
7
Lambasingi
2021-10-07 16:05:28

ప్రకృతి సహజ సిద్ధమైన రమణీయ అందాలతో అలరారుతున్న ఆంధ్రా కాశ్మీరం లంబసింగిలో అరుదైన విశేషాలతో అందమైన ఉద్యానవనం మధ్యన రూపుదిద్దుకోనున్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.విశాఖజిల్లా, చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో సుస్థిరమైన స్థానం ఉంది. రక్షిత అడవుల పేరుతో పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి-నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునేవారు. అయితే గిరిజనులకు సరైన కూలీ కూడా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు పాల్పడేవారు.ఈ నేపథ్యంలోనే బ్రిటీష్ పాలకుల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగబడ్డారు. గాం గంటం దొర, గాం మల్లుదొరలతో కలిసి బ్రిటీష్ పాలకులపై ఇక్కడి నుంచే తిరుగుబాటును లేవనెత్తి బ్రిటీష్ అధికారులను తరిమికొట్టారు. ఈ చారిత్రిక ప్రాశస్థ్యం కలిగి ఉన్న కారణంగానే గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి తాజంగి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు.

4 జోన్లుగా ప్రదర్శనలు:
గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్ టీఎం) ఆధ్వర్యంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను 22 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మ్యూజియం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో రూ. 20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం, రూ.15 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో మ్యూజియం నిర్మాణాలకు రూ. 13 కోట్లను వినియోగించనున్నారు. ఈ మ్యూజియంకు సంబంధించిన ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గంటందొర, మల్లు దొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో అధునాతనంగా డిజైన్ చేసారు. యాంపి థియేటర్ తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియో విధానాలను రూ.5 కోట్లతో సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సాంప్రదాయకమైన గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో మ్యూజియం పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దనున్నారు. మరో రూ.6 కోట్ల వ్యయంతో పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక ఆధునికమైన రెస్టారెంట్ ను, రిసార్ట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంలో ఏ,బీ,సీ,డి అనే నాలుగు జోన్లుగా వివిధ అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జోన్-ఏ లో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు పూర్వం ఉన్న గిరిజనుల పరిస్థితులు, అప్పటి గిరిజనుల జీవన విధానం, వారికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-బి లో గిరిజనుల జీవితాల్లోకి బ్రిటీష్ పాలకు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష జంతు జాలాలను కళ్లకు కడుతూ  డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటు చేస్తారు. జోన్-సీ లో బ్రిటీష్ పాలకుల అరాచకాలపై గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-డీ లో స్వాతంత్ర్యానంతరం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలను గురించి తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. అక్టోబర్ 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఈ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

2023 మార్చి నాటికి పూర్తి చేస్తాం: పుష్ప శ్రీవాణి
ప్రస్తుతం ఉన్న గిరిజన మ్యూజియంల కంటే భిన్నంగా, అత్యాధునికమైన సాంకేతిక విధానాలతో సర్వ సౌకర్యాలతో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను నిర్మించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొరలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించే అంశాలు ఈ మ్యూజియంను సందర్శించే పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. 22 నెలల కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నామని 2023 మార్చి నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు.