కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..
Ens Balu
7
Vizianagaram
2021-10-08 16:14:10
కూరగాయలు, నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ శాఖల అధికారులు, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్లు, కూరగాయలు, నిత్యావసరాల హోల్‌సేల్ వర్తకులతో తన ఛాంబర్‌లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిశోర్ మాట్లాడుతూ, గత 15 రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఉల్లి, టమాటా, కూరగాయల ధరలు పెరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. గతేడాదితో పోలిస్తే, నిత్యావసరాల ధరలు బాగానే ఉన్నాయని, భారీ వర్షాలు, తుఫాన్లు కారణంగా ఇటీవలే కూరగాయల ధరలు మాత్రం పెరిగాయని అధికారులు చెప్పారు. ఇతర జిల్లాల ధరలతో పోల్చి చూశారు. టమాటా, ఉల్లి ధరలు పెరుగుతున్నాయని, వీటిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దసరా, పైడితల్లి అమ్మవారి పండగలను దృష్టిలో పెట్టుకొని, తగిన స్టాకు పెట్టుకోవాలని, ధరలు పెరగకుండా చూడాలని వర్తకులను కోరారు. రైతుబజార్లలో ఏరోజుకారోజు ధరలను సవరించాలని ఎస్టేట్ ఆఫీసర్లను ఆదేశించారు. కోవిడ్ సమయంలో జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపారస్తులు, మానవతా దృక్ఫథంతో తమవంతు సహకారాన్ని అందించారని, తగిన స్టాకును అందుబాటులో ఉంచడంతోపాటు, ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు. రైతు బజార్లలో, షాపులవద్దా కోవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని కోరారు. మాస్కు లేనిదే వినియోగదారులను అనుమతించవద్దని స్పష్టం చేశారు. శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని జెసి కిశోర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సరఫరా అధికారి ఎ.పాపారావు, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్, ఉద్యానశాఖ ఎడి లక్ష్మి, రైతుబజార్ ఎస్టేట్ అధికారులు సతీష్, ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిత్యావసరాల హోల్‌సేల్ వర్తకులు, కూరగాయల వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.