ప్రతీకుటుంబం దిశ యాప్ డౌన్ లోడ్ చేయాలి..


Ens Balu
8
Visakhapatnam
2021-10-08 16:49:10

విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో దిశ యాప్  డౌన్ లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్  డా. ఎ.మల్లిఖార్జున జిల్లా అధికారులను ఆదేశించారు.  శుక్రవారం  కలెక్టర్ కార్యాలయం నుండి పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులతో కలసి  మండల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన  దిశా చట్టం తప్పని సరిగా అమలు జరగాలని స్పష్టం చేసారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 70 లక్షల మంది డౌన్ లోడ్ చేసారని, కోటి మంది లక్ష్యంగా పెట్టారని, ఈ చట్టం వలన కలిగే ప్రయోజనం పై విస్తృత ప్రచారం  చేయడం తో  పాటు  ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత దానిని ఏ విధంగా ఉపయోగించాలన్నది కూడా అవగాహన కలిగించాలన్నారు.   ఎం .పి.డి.ఓ, ఎం .ఆర్.ఓ, పోలీసు తదితర అధికారులు ఒక టీమ్ లాగ ఏర్పడి వారంలో ఒక రోజు  దిశా చట్టం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. దిశా యాప్ లో చాలా ఫీచర్స్ ఉంటాయని, ఈ యాప్ ఉంటే మన ప్రక్కన పోలీసు ఎస్కార్టు ఉన్నట్లు భావించే విదంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు   ఎస్.ఓ.ఎస్ బటన్ నొక్కిన పది నిమిషాల లోపున పోలీస్  సహాయ సిబ్బంది వస్తారన్నారు.     గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి ఆ కుటుంబ సభ్యుల  ఆండ్రాయిడ్ ఫోన్ లో దిశా యాప్ డౌన్ లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రోజుకు వాలంటీర్ పరిధిలో గల సుమారు 50 ఇళ్లకు సర్వే చేయడంతో పాటు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయాలన్నారు. ఆయా ప్రాంతంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి టెస్ట్ కాల్ చేసి ప్రాక్టికల్ గా వారికి చూపించడం ద్వారా వారికి నమ్మకం కలుగుతుందన్నారు. నెలలో మూడవ శుక్రవారం మరియు శనివారం సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల తో కలసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం  వారి సమస్యలను తెలుసుకోవడం తో పాటు దిశా చట్టం దాని వలన కలిగే ఉపయోగం పై కూడా  అవగాహన కలిగించాలన్నారు.  రెండు వారాల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో  నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించాలన్నారు.  చదువు రాని వారు కూడా  మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే  ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందని దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందించడం జరుగుతుందన్నారు. 
రూరల్ ఎస్.పి బి.కృష్ణారావు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్న దన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నదని  ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే  విదంగా  అవగాహన కలిగించాలన్నారు.  ఎస్.ఓ. ఎస్ బటన్ ఆన్ చేయడం ద్వారా 10 నుండి 20 నిమిషాల లోపల పోలీసు  ఎస్కార్టు వచ్చి తక్షణ సహాయ సహకారాలను అందిస్తారన్నారు ప్రతి ఒక్కరూ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవల్సిందిగా సూచించారు. 
నాటు సారా,చీప్ లిక్కర్ లతో పాటు  బెల్టు షాపులను లేకుండా   మధ్య నిషేదిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని, దానిని పక్కాగా  అమలు జరపాల్సిన భాద్యత అధికారులదని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు.  సచివాలయ సిబ్బంది, ఎస్.ఇ.బి సమన్వయంతో వాటికి సంబందించిన సమాచారం అందిన వెంటనే తనిఖీలను చేపట్టాలన్నారు.  ఎస్.హెచ్.ఓ మరియు మండల స్థాయి అధికారి సంబంధిత వ్యక్తులపై బైండ్ఓవర్ చేయడం  పిడి చట్టం కింద చర్యలు చేపట్టి ఆర్.ఆర్ యాక్ట్  ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ ఎస్.పి బి.కృష్ణారావు మాట్లాడుతూ   మారుమూల ప్రాంతాలు మరియు ఏజేన్సీ ప్రాంతాలలో నాటు సారా తయారి ఎక్కువగా జరుగుతున్నట్లు దృష్టికి వస్తున్నదన్నారు.  ఎస్.ఇ.బి, లోకల్ పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ, సిబ్బంది కలిసి ఎప్పటి కప్పుడు దాడులు నిర్వహించి సంబందిత వ్యక్తులపై ఫైన్ వేసి కఠిన చర్యలకు చేపట్టాలన్నారు.   
 ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్న   గంజాయి సాగు  నివారణకు  సంబందించి ఫారెస్ట్,రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో  కో – ఆర్డినేట్ చేసుకొని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఐటిడిఎ పిఓ ఆర్ గోపాల కృష్ణను  ఆదేశించారు. బినామీలను,  రవాణా చేస్తున్న వాహనాల   యజమానులను గుర్తించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ చేయాలన్నారు. ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు ఆయా గ్రామాలలో సందర్శించి  ఆ ప్రాంత ప్రజలను ఉద్యాన పంటలు వేసే విధంగా  అవగాహన కల్పించాలన్నారు 
ఎస్.పి.మాట్లాడుతూ గంజాయి సాగు మరియు రవాణా విషయంలో విశాఖ  జిల్లా పేరు ప్రచారంలో ఉందని, ఆ ఇమేజ్ ను తగ్గించడానికి  సంబందిత శాఖల అధికారులు  విశేష కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, రుణాలను  వారికి అందించి  ఉద్యానపంటలు వేసే విధంగా ప్రోత్సాహించాలన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం . వేణుగోపాల రెడ్డి,  పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరైయారు.