"గో రక్షణే ధర్మరక్షణ " అనే మౌలిక అంశాన్ని సమాజంలోనికి తీసుకు వెళ్ళడానికి అక్టోబరు 30,31వ తేదీల్లో తిరుపతిలోని తారకరామ స్టేడియంలో " గో మహా సమ్మేళనం " కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం యుగ తులసి ఫౌండేషన్, శ్రీ గోధాం మహాతీర్ద్, పత్ మేడ వారితో సమావేశం నిర్వహించారు. " గోసేవే గోవిందుడి సేవ " అనే నినాదంతో ధర్మానికి ప్రతి రూపమైన గో సంరక్షణకు టిటిడి అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మొదటి రోజు వివిధ జిల్లాల నుండి వచ్చే రైతులతో గో ఉత్పత్తులతో ప్రదర్శన, రైతులకు గో ఆధారిత వ్యవసాయంపై అవగాన కల్పించనున్నట్లు చెప్పారు. రెండవ రోజు కంచి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ, రాజస్థాన్ పత్ మేడకు చెందిన గౌరుషి స్వామి శ్రీ దత్ శరణానంద్ మహారాజ్, ఉడిపి శ్రీశ్రీశ్రీ విద్యా ప్రసన్న స్వామిజీ వంటి 22 మంది దేశంలోని ప్రముఖ మఠాదిపతులు, పీఠాదిపతులు భవిష్యత్ తరాలకు గోవును ఎలా కాపాడుకోవాలనే అంశంపై అనుగ్రహ భాషణం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో కోవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ మొదటి రోజు వెయ్యి మంది, రెండవ రోజు వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఈ సమ్మేళనంపై సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు వీరబ్రహ్మం, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టిటిడి బోర్డు మాజీ సభ్యులు శివకుమార్, విజివోలు బాలిరెడ్డి, మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.