టిటిడి ఈవోను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు..
Ens Balu
15
Tirumala
2021-10-09 15:46:48
శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌ల బృందం టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు ఇప్పటివరకు తన ఉద్యోగ ప్రస్థానంలో ఎలా ఉపయోగపడ్డాయన్న అంశాలను అనుభవాలను ఉదాహరిస్తూ చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారిగా తన ప్రయాణాన్ని, వివిధ సందర్భాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన తన అనుభవాలను, అభివృద్ధి పనులను తెలియజేశారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడానికి అభివృద్ధి చెందిన జిల్లాలు మాత్రమే కాకుండా గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలలో కూడా పని చేయాలని ట్రైనీ ఐఏఎస్‌లకు ఈవో సూచించారు. అదేవిధంగా వారంలో 3 లేదా 4 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోగలిగితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. అనంతరం టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈవో ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో సదాభార్గవి, డెప్యూటీ ఈవోలు దామోదర్, రమణ ప్రసాద్ పాల్గొన్నారు.