హనుమ జన్మక్షేత్రం తిరుమల అంజనాద్రి..
Ens Balu
4
Tirupati
2021-10-09 16:43:30
తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామివారి జన్మస్థలమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ పేర్కొన్నారు. తిరుమల వసంత మండపంలో నిర్వహిస్తున్నవేంకటాచల మహత్యం, వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాస కార్యక్రమం శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డా. ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ మతంగ మహర్షి చెప్పిన విధంగా అంజనాదేవి సంతానం కోసం వేంకటాచలానికి విచ్చేసి ఆకాశగంగ వద్ద తపస్సు చేసిందని చెప్పారు. దాదాపు 12 నెలల కఠోర తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహంతో ఆంజనేయస్వామివారికి జన్మనిచ్చినట్లు తెలిపారు. తరువాత బాలాంజనేయస్వామి సూర్యదేవుని పండుగా భావించి పట్టుకోవడానికి వేంకటాద్రి నుండి లంఘించడం ఇలా అనేక విషయాలు వేంకటాచల మాహాత్మ్యం తెలియజేస్తుందని వివరించారు. అనంతరం శనివారం రాత్రి శ్రీవారికి కన్నుల పండువగా జరిగే ముత్యపుపందిరి వాహనం, ఆదివారం ఉదయం జరిగే కల్పవృక్ష వాహనసేవల వైశిష్ట్యాన్ని కమనీయంగా వ్యాఖ్యానించారు. చివరగా వేంకటాచల మహత్యంలోని స్తోత్రాలను 12 మంది టిటిడి వేదపండితులు భక్తులచే పారాయణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.