మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకొని కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లబ్ధిదారులకు సూచించారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాల్లో భాగంగా ఆదివారం కాకినాడ అన్నమ్మ గాటీసెంటర్ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 20 నుంచి 29వ వార్డు వరకు గల పది వార్డుల పరిధిలోని 1,075 స్వయం సహాయక సంఘాల మహిళలకు 6,94,01,231 రూపాయల మెగా చెక్‌ను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 31 పథకాల వివరాలను ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మహిళలకు వివరించారు. ఎమ్మెల్యే చంద్రేశేఖరరెడ్డి మాట్లాడుతూ 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో అందించే వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రెండో విడత సొమ్మును ఖాతాల్లో జమచేస్తున్నట్లు వివరించారు. పది రోజుల పాటు జరగనున్న ఆసరా సంబరాలను విజయవంతం చేయాలన్నారు. ఆసరా సొమ్మును ఇంటి నిర్మాణం లేదా సుస్థిర జీవనోపాధి తదితరాలకు ఉపయోగించుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, డిప్యూటీ మేయర్-2 వెంకట సత్యప్రసాద్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.