సిఎం వైఎస్.జగన్ పర్యటన ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
5
Tirumala
2021-10-10 11:18:32

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల తిరుపతి పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ నెల 11వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా  తిరుపతిలో రూ 25 కోట్ల ఖర్చుతో నిర్మించిన  చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి  తాత్కాలిక భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు రూ 25 కోట్లతో దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత రూ 15 కోట్లతో నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం తిరుమల చేరుకుని గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 12వ తేదీ మంగళవారం తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును,  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు. తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, టీటీడీ  జెఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం, వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, సిఎస్ఆర్ఎంఓ శేష శైలేంద్ర, తదితరులు పాల్గొన్నారు.