ఆర్థిక అభివృద్ధికి అంధత్వం అడ్డురాదని కీ.శే పబ్బరాజు వెంకటేశ్వరరావు కృషితో నిరూపించారని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన శ్రీ షిర్డీ సాయి దీనజన సేవా సమితి ఆధ్వర్యంలో కీ.శే పబ్బరాజు వెంకటేశ్వరరావు 87వ జయంతి గుంటూరు లో ఘనంగా జరిగింది. 25 సంవత్సరాల క్రితం పబ్బరాజు వెంకటేశ్వర్లు ఇద్దరు అంధుల తో ప్రారంభించిన అంధుల పాఠశాల దినదినాభివృద్ధి చెంది వందలాది అంధుల జీవితాల్లో వెలుగులు నింపిందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.దాదాపు 200 మంది అంధులు ప్రభుత్వ ఉద్యోగాలు పొంది నేడు అభివృద్ధి పథంలో ముందుకు నడవటానికి దిక్సూచిగా పబ్బరాజు వెంకటేశ్వర్లు జీవితం నిలిచిందన్నారు. గుంటూరు బ్రాడీపేట 2/12 లో గల 500 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అంధుల పాఠశాలకు శాశ్వత చిరునామాగా ఏర్పాటు చేస్తామని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హామీ ఇచ్చారు. దాతలు ఇచ్చిన విరాళాలను సక్రమంగా వినియోగించి దాదాపు 2.5 కోట్ల నిధులను ప్రభుత్వ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచడం పబ్బరాజు వెంకటేశ్వరరావు నిజాయితీకి నిదర్శనమన్నారు. సమాజంలో ధాత్రుత్వం మరింత పెరగాలని తద్వారా పేద,బలహీన వర్గాల సాధికారత సాధ్యమౌతుందని అన్నారు. శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి అధ్యక్షులు అనంగి పూర్ణచంద్రరావు ప్రసంగిస్తూ కీ.శే.పబ్బరాజు వెంకటేశ్వర్లు పేరుతో స్మారక మానవీయ సేవా పురస్కారాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించి లక్ష రూపాయల అవార్డును అందిస్తామన్నారు. త్వరలో వృద్ధాశ్రమం,అనాధాశ్రమం నిర్మించాలని తలపెట్టినామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కేతరాజు నరసింహారావు,యన్.తిరుపతయ్య, దాసరి హనుమంతరావు, రిటైర్డ్ హెడ్మాస్టర్ వేమూరి శ్రీరామమూర్తి, పన్నాల సత్యనారాయణమూర్తి, వెలగపూడి పాండురంగారావు, ఆవుల మర్రిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.